SP manifesto: 2025కల్లా కులగణన

  • కనీస మద్దతు ధరకు చట్టబద్ధత
  • సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో హామీ

లక్నో : 2025కల్లా కులాల ప్రాతిపదికగా జనగణన చేపడ తామని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని, అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేస్తామని సమాజ్‌వాది పార్టీ హామీ ఇచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ బుధవారం తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను సీనియర్‌ పార్టీ నేతల సమక్షంలో ఇక్కడ విడుదలజేశారు. దీనికి ‘జనతా కా మాంగ్‌ పాత్ర – హమారా అధికార్‌’ అని నామకరణం చేశారు. కేంద్రంలో ఈసారి పిడిఎ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు. పిడిఎ ప్రభుత్వం అంటే అంటే వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలతో కూడిన ప్రభుత్వమని అర్ధం. కేంద్రంలో ఇండియా బ్లాక్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపడతామన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసిల ఖాళీలను ఏడాదిలోగా భర్తీ చేస్తామన్నారు. యువతకు శాపంగా మారిన అగ్నిపథ్‌ను రద్దు చేసి, రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌ను ప్రవేశపెడతామన్నారు. పాత పెన్షన్‌ పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. 2029కల్లా దారిద్య్రాన్ని సంపూర్ణంగా నిర్మూలిస్తామన్నారు. రైతుల వ్యవసాయ రుణాలను రద్దు చేస్తామని, రైతాంగ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని, ఉచితంగా నీటిపారుదల సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. భూమిలేని చిన్న, మధ్య తరగతి రైతులకు నెలకు రూ.5వేలు పెన్షన్‌ ఇస్తామన్నారు. మహిళలపై నేరాల కట్టడికి జాతీయస్థాయిలో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయడంతో పాటు నియోజకవర్గాల పునర్విభజన జరిగేవరకు వేచి వుండకుండా అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనే చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

➡️