మోసగించడం ఆపండి : బడ్జెట్‌పై ఐద్వా అసంతృప్తి

Feb 2,2024 10:38 #aidwa, #Budget, #Cheating, #Stopped, #unhappy
  • మహిళా సాధికారతపై మోసపూరిత ప్రకటనలని విమర్శ

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ పట్ల ఐద్వా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది, ఎన్నికల ముందు ప్రచార పత్రం తప్ప మరొకటి కాదని విమర్శించింది. మహిళా సాధికారతలో విజయాల గురించి ఈ ప్రభుత్వం ఆర్భాటంగా చేస్తున్న ప్రచారాన్ని మహిళల ఉపాధి అవకాశాలు క్షీణించడం, కొనసాగుతున్న ఆర్థిక దుస్థితి, పెరుగుతున్న ఆకలి వంటి వాటిల్లో చూడాలని ఐద్వా పేర్కొంది. ఇవన్నీ కలిసి మహిళల జీవితాల్లో అంతులేని కష్టాలను నింపుతున్నాయని పేర్కొంది. ఆర్థిక మంత్రి వాస్తవిక పరిస్థితులను గమనంలోకి తీసుకోవాలని, మహిళలను మోసం చేయడాన్ని ఆపాలని ఐద్వా కోరింది. 2014-2021 మధ్య కాలంలో మహిళా కార్మికుల ఆత్మహత్యలు 137శాతం పెరిగాయని తెలిపింది. మహిళల సాధికారత అనేది పెట్టుబడులపై కాదని, ఫలితాలపై ఆధారపడి వుంటుందని ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారని, అంటే దానర్ధం మహిళాభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయింపులు కీలకం కాదని చెప్పకనే చెబుతున్నారని విమర్శించింది. మహిళా లబ్దిదారుల సంఖ్య గణనీయంగా వున్న ఉపాధి హామీ (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌) గురించి అసలు ప్రస్తావనే లేదని, ఈ పథకాన్ని మొత్తంగా నిలిపివేయడానికి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని స్పష్టమవుతోందని ఐద్వా పేర్కొంది. గత బడ్జెట్‌లో ప్రకటించిన బాలికల పొదుపు మొత్తాల పథకం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. పైగా జన ధన్‌ పథకంలో మోసాల గురించి కాగ్‌ బట్టబయలు చేసింది. అటువంటప్పుడు ఈ పథకాల గురించి మహిళా సాధికారత అంటూ ఈ ప్రభుత్వం చేసుకునే ప్రచారం ఏ మాత్రమూ సరికాదని ఐద్వా పేర్కొంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లును, మూడుసార్లు తలాక్‌ బిల్లును ఆమోదించడాన్ని నారీ శక్తిగా ప్రభుత్వం చెప్పుకుంటోంది. గతంలో వీటిపై ఐద్వా తీవ్రమైన విమర్శలు చేసిందని, ఇకపై కూడా ఈ ప్రభుత్వ మహిళా వ్యతిరేక వైఖరిని బహిర్గతం చేస్తామని తెలిపింది. రాబోయే ఎన్నికల్లో ఈ నిరంకుశ, మనువాదీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజాతంత్ర శక్తులు, మహిళలు ఏకం కావాలని పిలుపునిచ్చింది.

➡️