కెఆర్‌ఎంబి ప్రాజెక్టులపై రాతపూర్వక వాదనలు సమర్పించండి

May 1,2024 00:36 #KRMB, #supreem court
  • తెలుగు రాష్ట్రాలకు ‘సుప్రీం’ ఆదేశం

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ ఆధ్వర్యంలో జలవిద్యుత్‌ ఉత్పత్తి చేయడం, కెఆర్‌ఎంబి ఆధీనంలోని ప్రాజెక్టుల పరిధిపై ఇరు రాష్ట్రాలు రాతపూర్వక వాదనలు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జిఒ నెంబరు 34, రిట్‌ పిటిషన్‌పై విచారణ ప్రారంభించింది. మెరిట్స్‌ ఆధారంగా కేసు విచారణ చేస్తామని ముందు సుప్రీం ప్రకటించింది. తెలంగాణ తరపున సీనియర్‌ న్యాయవాది సిఎస్‌ వైద్యనాదన్‌ వాదనలు వినిపిస్తూ ఎపి లేవనెత్తిన అంశాలను జలవివాదాన్ని ప్రేరేపిస్తున్నాయని అన్నారు. ఆర్టికల్‌ 32 కింద ఉన్న ప్రాథమిక హక్కునూ ఆర్టికల్‌ 262 ద్వారా అడ్డుకోవచ్చా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ తరపున సీనియర్‌ న్యాయవాది జైదీప్‌ గుప్తా వాదిస్తూ రిట్‌ పిటిషన్‌ ద్వారా మధ్యంతర ఉత్తర్వు ఇవ్వాలని కోరారు. జలవిద్యుత్‌ శక్తిని వంద శాతం వినియోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం జిఒ 34 ను విడుదల చేసిందన్నారు. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాలు రాతపూర్వక సమాధానాలు కోర్టుకు సమర్పించాలని సుప్రీం సూచించింది. అనంతరం ఈ కేసును జులై తొమ్మిదికి వాయిదా వేసింది.

➡️