కర్ణాటక డిప్యూటీ సిఎం శివకుమార్‌పై మనీలాండరింగ్‌ కేసు కొట్టివేత

న్యూఢిల్లీ : కర్ణాటక ఉపముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పిసిసి చీఫ్‌ డి.కె. శివకుమార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) నమోదు చేసిన మనీలాండరింగ్‌ కేసును సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కెవి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. శివకుమార్‌ కుట్రపూరితంగా ఆదాయపన్నును ఎగవేయడానికి ప్రయత్నించినట్లు 2018లో ఆదాయపు పన్ను శాఖ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ మనీలాండరింగ్‌ కేసును ఇడి నమోదు చేసింది. ఈ కేసుకు వ్యతిరేకంగా శివకుమార్‌ తొలుత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ, ఇడి సమన్లను సమర్థిస్తూ హైకోర్టు 2019 ఆగస్టులో తీర్పు ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో శివకుమార్‌ పిటీషన్‌ వేశారు. ఈ కేసు రాజకీయ ప్రేరితమని పేర్కొన్నారు. దీంతో 2019 అక్టోబర్‌లోనే శివకుమార్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఇడిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఈ కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

➡️