ఇడి దుర్వినియోగం పరిశీలనకు ప్రత్యేక యంత్రాంగం అవసరం 

supreme court on special team on ED misuse

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ప్రతిపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లో పెత్తనం చలాయించేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి)ని దుర్వినియోగం చేస్తోందన్న విమర్శల నేపథ్యంలో సుప్రీంకోర్టు గురువారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతిపక్షాల నేతలపై కేంద్ర ప్రభుత్వం ఇడిని ఉసిగొల్పి తన రాజకీయ ప్రయోజనాలకు దుర్వినియోగం చేస్తుంటే మరోవైపు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు స్థానికంగా ఉండే ఇడి అధికారులపై ప్రతి చర్యలు చేపడుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో అసలు దుర్వినియోగ, కక్ష సాధింపు చర్యల పరిశీలన కోసం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇటువంటి యంత్రాంగాన్ని అమలు చేసేందుకు తమిళనాడును ఒక ప్రయోగ వేదికగా చేయాలని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కెవి విశ్వనాథన్‌లతో కూడిన బెంచ్‌ పేర్కొంది. ఇలా రాష్ట్రాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు పరస్పరం కేసులు పెట్టుకోవడం ద్వారా ఆధిక్యత నిరూపించుకునేందుకు ప్రతీకార ఆటలాడుతున్నట్లైతే దేశ భవితవ్యం ఏమిటని బెంచ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇడి, సిబిఐలకు దేశవ్యాప్తంగా శాఖలు వున్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ వారికి అధికారులు వున్నారు. మీరు కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారు, లేదా వారు ప్రతీకార వాంఛతో వున్నారని మేం చెప్పడం లేదు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో, వారి వైపు నుండి కక్ష సాధింపు చర్య వుంటే, దానికి బదులుగా మీ వైపు నుండి ప్రతీకార చర్య వుంటే, ఇది ఇలాగే కొనసాగితే, మన ఫెడరల్‌ వ్యవస్థకు ఏమవుతుంది? మన దేశానికి ఏం జరుగుతుంది? ” అని జస్టిస్‌ విశ్వనాథన్‌ ప్రశ్నించారు. ఇడి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. మంత్రులు, అధికారులుపై వచ్చిన ఫిర్యాదులు, ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించిన దర్యాప్తు వివరాలను తమిళనాడు పంచుకోవడం లేదంటూ ఇడి తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించడంతో బెంచ్‌ పై వ్యాఖ్యలు చేసింది. దీనిపై సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌, తమిళనాడు అదనపు అడ్వకేట్‌ జనరల్‌ అమిత్‌ ఆనంద్‌ తివారిలు స్పందిస్తూ, కేంద్రం, ఇడిని ఉపయోగించి బిజెపియేతర పాలిత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శించారు. ఇలా రాజకీయ కక్ష సాధింపు చర్యలతో ఫెడరల్‌ వ్యవస్థ స్తంభిస్తోందని అన్నారు. అంతర్రాష్ట్ర పర్యవసానాలను పరిశీలించేందుకు సక్రమ, పారదర్శకమైన యంత్రాంగాన్ని ఒకదాన్ని మనం అన్వేషించాల్సి వుందని జస్టిస్‌ విశ్వనాథన్‌ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కేంద్రంలో, రాష్ట్రంలో వేర్వేరు పార్టీలు అధికారంలో వున్నపుడు, కక్ష సాధింపు చర్యలను నివారిస్తూనే దోషులను శిక్షించే లక్ష్యం దెబ్బ తినకుండా వుండేలా ఈ యంత్రాంగం వుండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇడి దాఖలు చేసిన నిజమైన, నిజాయితీ కలిగిన కేసుల్లో నిందితుడు ఇలా రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలు, గగ్గోలుతో తప్పించుకోవడానికి వీల్లేకుండా ఈ యంత్రాంగం చూడాలని కోర్టు పేర్కొంది.

➡️