ఏకపక్షంగా కోర్టుకు పిలిచే విషయంలో అధికారులకు మినహాయింపు 

Jan 4,2024 09:19 #Supreme Court
supreme court on standard operation procedure

 

సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : న్యాయస్థానాలు అధికారులను కోర్టులకు పిలిపించడం, వస్త్రధారణపై వ్యాఖ్యలకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అధికారులను కించపరిచేలా మాట్లాడడం, వారి వేషధారణపై వ్యాఖ్యలు చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరిం చాలని న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు సూచనలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వాధికారులను కోర్టుల ముందు హాజరుకావా లంటూ జారీ చేసే సమన్లు విషయంలో ‘స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌’ పేరిట కొన్ని మార్గదర్శకాలు సూచించింది. ఏకపక్షంగా కోర్టుకు పిలిపించే విషయంలో అధికారులకు మినహాయింపునివ్వాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలను దేశంలోని అన్ని హైకోరు ్టలు తప్పనిసరిగా అనుసరించాలని ఆదేశించింది. అధికారుల వస్త్రధారణపై వ్యాఖ్యలకు న్యాయమూర్తులు దూరంగా ఉండాలని, కోర్టు కార్యాలయంలో దుస్తుల కోడ్‌ను ఉల్లంఘిస్తే తప్ప అధికారుల వస్త్రధారణను కించపరిచేలా మాట్లాడొద్దని ధర్మాసనం నొక్కి చెప్పింది. గతేడాది ఇద్దరు సీనియర్‌ ప్రభుత్వ అధికారులు కోర్టుకు హాజరుకావాలంటూ అలహాబాద్‌ హైకోర్టు సమన్లు జారీ చేయడాన్ని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సవాలు చేసింది. ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాలను సమర్థించింది. అయితే ప్రభుత్వాధికారు లను తరచూ కోర్టులకు పిలిపిస్తే రాజ్యాంగం ప్రకారం అమలవుతున్న పథకాల అమలు విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు బుధవారం ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. అఫిడవిట్‌ల ద్వారా సమస్యలను పరిష్కరిస్తే ప్రభుత్వ అధికారులను కోర్టులకు పిలవాల్సిన అవసరం ఉండదని సూచన చేసింది. అయితే కేసు ప్రక్రియలో భాగంగా సాక్ష్యంగా అధికారుల వ్యక్తిగత హాజరు ఆవశ్యకతను కోర్టు గుర్తు చేసింది. కోర్టు దృష్టికి భిన్నంగా అధికారి ఆలోచించి నంత మాత్రన సమన్లు జారీ చేయడం తగదని ధర్మాసనం స్పష్టం చేసింది.

➡️