Swati Maliwal case: కేజ్రీవాల్‌ పిఎ అరెస్టు

May 19,2024 08:37 #arrested, #Bibhav Kumar, #Swati Maliwal
  •  బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ కోర్టు
  •  స్వాతి కేసులో బిభవ్‌ కుమార్‌కు లభించని ఊరట

న్యూఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పిఎ బిభవ్‌ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో బిభవ్‌ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేయడానికి ముందుగానే ముందస్తు బెయిల్‌ కోసం ఢిల్లీ కోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ నెల 13న కేజ్రీవాల్‌ను కలిసేందుకు స్వాతి మలివాల్‌కు ఎలాంటి అపాయింట్‌మెంట్‌ లేదని బిభవ్‌ కుమార్‌ తరపు సీనియర్‌ న్యాయవాది ఎన్‌ హరిహరన్‌ కోర్టుకు తెలిపారు. సిఎం కేజ్రీవాల్‌ భద్రతా ఉల్లంఘనకు ఆమె ప్రయత్నించారని చెప్పారు. స్వాతి మలివాల్‌పై దాడి ఆరోపణలు కల్పితమని బిభవ్‌ కుమార్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియోలను ఆయన సమర్పించారు. ఎవరి ఒత్తిడి వల్లనో ఈ నెల 16న పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారని తెలిపారు. బిభవ్‌ కుమార్‌కు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేసినట్లు కోర్టుకు వివరించారు. మరోవైపు బిభవ్‌ కుమార్‌ ముందస్తు బెయిల్‌పై విచారణ జరుగుతుండగా శనివారం సాయంత్రం 4.15 గంటలకు ఆయనను పోలీసులు అరెస్టు చేసినట్లు అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అతుల్‌ కుమార్‌ శ్రీవాస్తవ కోర్టుకు తెలిపారు. దీంతో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను నిరుపయోగంగా పరిగణించాలని కోరారు. ఈ నేపథ్యంలో బిభవ్‌ కుమార్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. బిభవ్‌ కుమార్‌ని కేజ్రీవాల్‌ నివాసం నుంచే పోలీసు బృందం శనివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్‌ స్టేషన్‌కి తరలించినట్లు సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసులో పూర్తి సహకారం అందిస్తామని అధికారులకు ఇ-మెయిల్‌ పంపినప్పటికీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బిభవ్‌ తరపు న్యాయవాది కరణ్‌ శర్మ మీడియాకు తెలిపారు.

➡️