ఊరట ఇవ్వని ఆఖరి కేబినెట్‌

Mar 4,2024 10:12 #last cabinet, #New Delhi
  • సంక్షేమం ఉసేలేని సుదీర్ఘ భేటీ
  • ఉపదేశాలు,ప్రగల్భాలతో సరి

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆదివారం జరిగిన కేబినెట్‌ సమావేశం కనీస మద్దతు ధర కోసం ఉద్యమిస్తున్న రైతులకు కానీ, అధిక ధరలతో విలవిలలాడుతున్న సామాన్యుడికి కానీ, ఉద్యోగాల భర్తీ కోసం ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న యువతకు కానీ ఊరట కల్పించే ఎలాంటి నిర్ణయమూ చేయలేదు. కేబినెట్‌ చరిత్రలోనే అతి సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశం రానున్న ఎన్నికల్లో విజయం తమదేనని మంత్రుల్లో నమ్మకం కలిగించడానికి, 2047లో భారత్‌ దివ్యంగా వెలిగిపోతుందని చెప్పడం కోసమే ఉద్దేశించినట్లుగా ఉందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు. ఇంతకుముందు జరిగిన కేబినెట్‌ సమావేశాలకు భిన్నంగా ఇది జరిగింది. ప్రజలెదుర్కొంటున్న సమస్యల గురించిన ఊసే లేదు. పైగా రెండు పర్యాయాలు అధికారంలో ఉండి చేయలేనివి, మూడోసారి గెలిస్తే చేసేద్దామని ప్రగల్భాలు పలికారు. ‘వికసిత్‌ భారత్‌ 2047’ లక్ష్య సాధనకు సిద్ధంగా ఉండాలంటూ ఉపదేశాలిచ్చారు. కొన్ని రోజుల వ్యవధిలోనే 2024 లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వస్తుందని, ఈ నోటిఫికేషన్‌కు ముందు ఆదివారం జరిగే సమావేశమే ప్రస్తుత మోడీ ప్రభుత్వ మంత్రివర్గానికి ఆఖరి క్యాబినేట్‌ సమావేశంగా వార్తలు వచ్చాయి. సాధారణంగా బుధవారం జరిగే క్యాబినేట్‌ భేటీ ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆదివారం నిర్వహించడంతో సహజంగానే ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది.. కనీసం ఎన్నికలకు ముందైనా ఎలాంటి సంక్షేమ పథకమైన ప్రకటిస్తారని ఆశించినవారికి నిరాశే మిగిల్చింది. మోడీ మూడోసారి గెలవడం గురించే ఎక్కువగా మాట్లాడారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి వంద రోజుల్లో చేయాల్సిన పనులు గురించి తన మంత్రులకు హితబోధ చేశారు. ‘వికసిత్‌ భారత్‌ 2047’ రోడ్‌ మ్యాప్‌ అంటూ హడావిడి చేశారు. . సుమారు రెండున్నర ఏళ్లు కష్టపడి ఈ రోడ్‌ మ్యాప్‌ తయారు చేసినట్లు చెప్పారు. ఈ ప్రక్రియను నీతి ఆయోగ్‌ ముందుండి నడిపించిందని అన్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, పారిశ్రామిక సంస్థలు, పౌర సంఘాలు, శాస్త్రీయ సంఘాలతో విస్తృతంగా సమావేశాలు జరిపి, వాటి ఆలోచనలు, సూచనలు, ఇన్‌పుట్లు స్వీకరించిన తరువాత ఈ రోడ్‌మ్యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న చేయలేవన్నీ మూడో పర్యాయం అధికారంలోకి రాగానే ప్రారంభిద్దామని మోడీ తన మంత్రుల ముందు డబ్బాలు కొట్టారు. మొత్తానికి మోడీ క్యాబినెట్‌ చివరి భేటీ కూడా ప్రజలను నిరాశపర్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

➡️