బిజెపిపై పోరులో అగ్రభాగాన వామపక్షాలు

Mar 28,2024 16:15 #setharam yechuri, #speech
  • ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తాం
  • పిటిఐ ఇంటర్వ్యూలో సీతారాం ఏచూరి

న్యూఢిల్లీ : లోక్‌సభలో సంఖ్యాబలం తగ్గిందా పెరిగిందా అన్నదాంతో నిమిత్తం లేకుండా బిజెపిపై పోరుకు ఎజెండాను సెట్‌చేయడంలో వామపక్షాలు ఎప్పుడూ అగ్ర భాగాన వున్నాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 370వ అధికరణ, సిఎఎఎ, వ్యవసాయ చట్టాలు, ఎన్నికల బాండ్లు ఇలా ప్రతి అంశంపైనా బిజెపికి వ్యతిరేకంగా పోరు సల్పేందుకు సిద్ధంగా వున్నామని చెప్పారు. అలాగే రాబోయే ఎన్నికల్లో తమ సీట్ల సంఖ్య మెరుగుపరుచుకోగలమని ఆశిస్తున్నట్లు చెప్పారు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏచూరి పలు అంశాలపై సవివరంగా తన అభిప్రాయాలు పంచుకున్నారు. దక్షిణాది దేశాల్లో బిజెపి పాగా వేయడం అసాధ్యమని అన్నారు. సీట్ల పరంగా ఈసారి ఎన్నికల్లో వామపక్షాలు కచ్చితంగా తమ బలాన్ని మెరుగుపరుచుకుంటాయి. ఎన్ని సీట్లను గెలుచుకుంటాయనేది కాదు ముఖ్యం. ఎజెండాను రూపొందించడంలో ఎటువంటి పాత్ర పోషిస్తున్నాయన్నది ఇక్కడ కీలకం” అని ఏచూరి పేర్కొన్నారు. ‘గత ఐదేళ్ళ కాలాన్ని ఒక్కసారి పరిశీలించినట్లైతే, బిజెపి తీసుకొచ్చిన విచ్ఛిన్నకరమైన లేదా రాజ్యాంగ విరుద్ధమైన ప్రతి అంశంపైనా వామపక్షాలు ఎజెండాను రూపొందిస్తూ వచ్చాయి. అదే సమయంలో ప్రజా పోరాటాలు నిర్వహించాయి.” అని ఏచూరి తెలిపారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై వామపక్షాలు చేసిన పలు పోరాటాలను ఉదహరించారు.
‘370వ అధికరణ రద్దును వ్యతిరేకించింది మొట్టమొదటగా వామపక్షాలే. వాస్తవానికి, సుప్రీం కోర్టు అనుమతి, ఆదేశాలతో శ్రీనగర్‌ను మొట్టమొదట సందర్శించిన రాజకీయ నేత తానేనన్న విషయాన్ని ఏచూరి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అలాగే, 370వ అధికరణను రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్‌లో కర్ఫ్యూ విధించి, రాజకీయ నేతలను నిర్బంధించారు. ఆ సమయంలో తమ పార్టీ నాయకుడు యూసఫ్‌ తరిగామిని ఎక్కడ నిర్బంధించారో తెలుసుకోగోరుతూ కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను తానే మొదట వేశానని ఏచూరి తెలిపారు.
అస్వస్థతగా వున్న తరిగామిని చూసేందుకు శ్రీనగర్‌ వెళ్లేందుకు అనుమతి సాధించడం దగ్గర నుంచి, ఆయనకు మెరుగైన వైద్యం అందించడం కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకొచ్చి, తిరిగి కాశ్మీర్‌కు పంపేవరకు అవసరమైన అనుమతుల కోసం తాను పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందన్నారు.
ఇక రెండో అంశం పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ). దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగడంలో, నిరసనలు తెలియచేయడంలో, సుప్రీం కోర్టులో సవాలు చేయడంలో అన్నింటా వామపక్షాలు అగ్ర భాగాన వున్నాయని ఏచూరి చెప్పారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించడం, అలాగే జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సి)ను తీసుకురావడం ఢిల్లీలో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో వరుస నిరసనలకు దారి తీసింది. 2014 డిసెంబరు 31న లేదా అంతకుముందు భారత్‌ వచ్చిన, పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌లకు చెందిన మైనారిటీ కమ్యూనిటీలైన హిందువులు, బౌద్ధులు, సిక్కులు, క్రైస్తవులు, జైన్‌లకు పౌరసత్వ మంజూరు ప్రక్రియను ఈ చట్టం వేగిరపరుస్తుంది.
ఎన్నికల బాండ్ల విషయంలో గానీ, బిల్కిస్‌ బానో రిఫరెన్స్‌ కేసులో గానీ ఇలా ప్రతి ఒక్క అంశంపైనా అటు ఎజెండా రూపొందించడం, ఇటు ప్రజా పోరాటాలు నిర్వహించడం రెండూ ఏకకాలంలో వామపక్షాలు చేపడుతూ వచ్చాయని ఏచూరి చెప్పారు. బిల్కిస్‌ బానో కేసులో దోషులందరినీ విడుదల చేయడానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించిన వారిలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ వున్నారని అన్నారు.
2002 నాటి గుజరాత్‌ నరమేధం కేసులో బిల్కిస్‌ బానోపై సామూహికంగా అత్యాచారం జరిపి, ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురిని హతమార్చిన కేసులో 11మంది దోషులకు శిక్షను తగ్గిస్తూ గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. అలాగే ఎన్నికల బాండ్లను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన వారిలో అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) తో పాటూ సిపిఎం కూడా పిటిషనర్‌గా వుంది. తాము చేసిన పోరాటం ఫలితంగా ఎన్నికల బాండ్లను సుప్రీం రద్దు చేసింది, విరాళాలకు సంబంధించిన డేటా బయటకొచ్చింది.
నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి దారి తీసిన 2020-21 రైతాంగ నిరసనలను కూడా ఏచూరి ఈ సందర్భంగా ఉదహరించారు.
” కార్పొరేట్‌ అనుకూల, రైతు వ్యతిరేక వైఖురి తీసుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వ మెడలు వంచేలా చేసింది చారిత్రక రైతాంగ పోరాటమొక్కటే. ఆ చట్టాలను చివరికి ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.” అని ఏచూరి చెప్పారు.
నిరసనలకు నేతృత్వం వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చాలో వామపక్షాలకు చెందిన అనేక రైతు సంఘాల సభ్యులుగా వున్నాయి. వామపక్ష రైతు సంఘం అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) కూడా ఎస్‌కెఎంలో ప్రధాన భాగంగా వుంది.
”కాబట్టి ఈ అన్ని విషయాల్లోనూ ఎజెండా రూపకల్పనలో వామపక్షాలు ముఖ్య భూమిక వహించాయి. ఈ ఎన్నికల అనంతరం వామపక్షాలు మరింత బలోపేతమవుతాయి.” అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ సీట్ల సంఖ్యను మెరుగుపరుచుకుంటుందని చెప్పారు. వివిధ రాష్ట్రాల నుండి లోక్‌సభలో ప్రవేశిస్తాం. గత సారి కన్నా ఎక్కువ రాష్ట్రాల నుండి గెలుస్తాం, గతంలో తమిళనాడు, కేరళల్లో గెలిచామని చెప్పారు. ఈసారి గతంలో కన్నా మెరుగైన ఫలితాలు వుంటాయన్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి పాగా వేసే అవకాశం వుందా అని ప్రశ్నించగా, అస్సలు లేదని ఏచూరి స్పష్టం చేశారు. ”ప్రధాని ఎంతలా శ్రమించినా, జై భజరంగ బలి పేరుతో ఓట్లను అడిగిన కర్ణాటకలో మాదిరిగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తలకిందులు తపస్సు చేసినా దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి గెలిచే అవకాశాలు అస్సల్లేవని చెప్పారు.
”కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో మీరు చూశారు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో చూశారు. ఇలాంటి ట్రిక్కులు ఎల్లకాలం పనిచేయవు.” అని ఏచూరి చెప్పారు.
మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ఉత్తరాది రాష్ట్రాల్లో భావోద్వేగాలను బిజెపి రెచ్చగొట్టవచ్చని, కానీ దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి పప్పులుడకవని ఏచూరి పేర్కొన్నారు.

➡️