ఊకదంపుడు విమర్శలే

Feb 6,2024 11:18 #parlametary meeting, #PM Modi
  • ఇడి, సిబిఐతో రాజకీయ కక్ష సాధింపులపై నోరు మెదపని ప్రధాని

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానం ఇవ్వాల్సిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాజకీయ ప్రసంగమే చేశారు. ఈ ఐదేళ్లలో తానేం చేశానో చెప్పడం కంటే, ప్రతిపక్షాలపై విమర్శలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఊకదంపుడు విమర్శలతో ప్రసంగమంతా సాగింది. ఇడి, సిబిఐతో రాజకీయ కక్ష సాధింపులపై నోరు మెదపని ప్రధాని మోడీ, ప్రతిపక్షాలపై నోరు పారేసుకున్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీపైనా చౌకబారు విమర్శలతో రెచ్చిపోయారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నరేంద్ర మోడీ సోమవారం సమాధానం ఇచ్చారు. దేశంలో నాలుగు వ్యవస్థలు పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ప్రధాని అన్నారు. తమ ప్రభుత్వంపై పదే పదే ఆరోపణలు చేయడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని, ఎన్నికల్లో ఓటమి కోసమే ప్రతిపక్షాలు తీవ్రంగా కష్టపడుతున్నాయని అన్నారు. ప్రతిపక్షాల దుస్థితికి కాంగ్రెస్సే కారణమని అన్నారు. మైనారిటీలంటూ ఎంతకాలం విభజన రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు. తోటి ప్రతిపక్షాలను కాంగ్రెస్‌ ఎదగనీయలేదని, కాంగ్రెస్‌ తీరు దేశానికి, ప్రజాస్వామ్యానికి నష్టమని అన్నారు. ప్రాంతీయ జనాభా ఆధారంగా మైనారిటీ నిర్వచనం మారవచ్చని నొక్కి చెప్పిన ఆయన.. మత్స్యకారులు, జంతువుల కాపరులు, రైతులు, మహిళలు మైనారిటీలు కారా? అని ప్రశ్నించారు. విభజించు పాలించు పక్కనపెట్టేసి.. అందరినీ కలుపుకుపోయే పాలనపై దృష్టి పెట్టాలని ప్రతిపక్షాలను కోరారు. విభజనల గురించి ఎంతకాలం ఆలోచిస్తారు? సమాజాన్ని విడదీస్తూ ఇంకెంతకాలం ఉంటారు? అని ప్రశ్నించారు. ఒకే ప్రొడెక్టును పదే పదే లాంచ్‌ చేసి చివరికి తన దుకాణానికి తాళం వేసే దుస్థితికి కాంగ్రెస్‌ పార్టీ చేరుకుందని అన్నారు.

వంద రోజుల్లో మూడోసారి ఎన్‌డియే అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. అబ్‌ కీ బార్‌ మోడీ సర్కార్‌ అని ఖర్గే కూడా అంటున్నారని నవ్వుతూ చెప్పారు. బిజెపికి 370కు పైగా సీట్లు వస్తాయని, ఎన్‌డియేకు 400కు పైనే సీట్లు వస్తాయన్నారు. ప్రతిపక్షాలు ఈసారి కూడా ప్రతిపక్షంలోనే ఉంటాయని అన్నారు. ప్రతిపక్షంలో ఉండటం కాంగ్రెస్‌ నేతలకు అలవాటైందని విమర్శించారు. కుటుంబ రాజకీయాలకు కాంగ్రెస్‌ పరాకాష్ట అని అన్నారు. దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరమన్నారు. మహిళలు, యువత, పేదలు, రైతుల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు. ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి చేరుకుందని అన్నారు. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాతే దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువయ్యాయని అన్నారు. ఇండియా ఫోరం అలైన్‌మెంట్‌ దెబ్బతిన్నదని, అందులో ఒకరిపై ఒకరికి నమ్మకం లేదని పేర్కొన్నారు. అలాంటప్పుడు దేశ ప్రజలు ఆయా పార్టీలను ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.

➡️