సామ్రాజ్యవాద, కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేక పోరాటాలు ఉధృతం

Apr 13,2024 07:33 #AIKS, #Seminar

– ఎఐకెఎస్‌, ఎఐఎడబ్ల్యుయు జాతీయ ప్రధాన కార్యదర్శులు విజూ కృష్ణన్‌, బి వెంకట్‌
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద, కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేక పోరాటాలు ఉధృతం చేయాలని ఎఐకెఎస్‌, ఎఐఎడబ్ల్యుయు జాతీయ ప్రధాన కార్యదర్శులు విజూ కృష్ణన్‌, బి వెంకట్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 10న సెనెగల్‌ రాజధాని సాలెదాకర్‌లో ప్రారంభమైన అంతర్జాతీయ వ్యవసాయాధారిత శ్రామిక యూనియన్‌ ఐదో మహాసభకు 85 దేశాల నుండి 125 సంఘాల ప్రతినిధులు పాల్గన్నారు. ఈ మహాసభలో భారత్‌ నుండి రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ప్రతినిధుల బృందం పాల్గంది.
యూనియన్‌ అంతర్జాతీయ కార్యదర్శి జనరల్‌ జూలియన్‌ హక్‌ నివేదికను ప్రవేశపెట్టారు. భారత్‌లో సాగిన చారిత్రాత్మక రైతాంగ పోరాటం ప్రపంచాన్నంతటినీ ఆకర్షించిందన్నారు. ఆహార భద్రత ప్రత్యామ్నాయ విధానాలకు భారీ సమీకరణగా ఈ ఉద్యమం సాగిందన్నారు. ఎఫ్‌ఎస్‌ఎమ్‌, డబ్ల్యుఎఫ్‌టియు ప్రధాన కార్యదర్శి పంపిస్‌ క్రీట్సిస్‌ తమ సందేశాన్ని అందించారు. ఈ మహాసభకు టియుఐ అధ్యక్షులు అలియు ఎన్‌డిఎ (సెనెగల్‌), విజూ కృష్ణన్‌ (ఇండియా), మొహ్మద్‌ యలియా (పాలస్తీనా) సహిద్‌ అబూబకర్‌ (ఈజిప్ట్‌), డు టీన్‌ డంగ్‌ (వియత్నాం) అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఇండియా నుండి ఎఐకెఎస్‌ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ మాట్లాడారు. ప్రపంచంలో లాగే తమ దేశంలో కూడా పాలకవర్గాల దన్నుతో కార్పొరేట్లు వ్యవసాయ రంగాన్ని తన గుప్పెట్లోకి లాక్కుంటున్నారని తెలిపారు. ఫలితంగా దేశంలో పేద ప్రజానీకానికి ఆహార భద్రత కొరవడుతుందన్నారు. శ్రమించి పండించిన రైతాంగానికి గిట్టుబాటు ధర హామీ లేదన్నారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి, కనీస వేతనాలు నానాటికి తగ్గిపోతున్నాయన్నారు. దీనిపై దోపిడీ వ్యతిరేక శక్తుల పోరాటాలు దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఇందుకు సంవత్సరం పైగా సాగిన చారిత్రాత్మక రైతు పోరాటం తార్కాణమన్నారు. ఇండియా ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పాలస్తీనాకు భారత్‌ ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు. దశాబ్దాలుగా భారత్‌ ప్రభుత్వం పాలస్తీనాకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. ప్రపంచంలోనూ, తమ దేశంలోనూ కొన్ని శక్తులు ఇజ్రాయిల్‌, అమెరికాకు తొత్తుగా వ్యవహరించడం బాధాకరమన్నారు.
దేశంలో రైతులు, వ్యవసాయ కార్మిక సంఘాలు విడివిడిగా స్వతంత్రంగా పనిచేస్తూనే, పరోపక్క ఐక్య పోరాటాలు సాగిస్తున్నాయన్నారు. ఫలితంగా ఈ సంఘాల్లో మూడు కోట్ల మందికిపైగా సభ్యులుగా చేరారని తెలిపారు. దేశంలో పోరాడే ప్రజల ఐక్యతను దెబ్బతీయడం కోసం దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. తమ దేశపు రాజ్యాంగం, లౌకికవాదాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న పోరాటాలకు భారతీయులు అండగా నిలుస్తున్నారని, రాబోయే కాలంలోనూ ఆ సంఘీభావ పోరాటాన్ని విస్తృతం చేస్తామని అన్నారు. ఈ మహాసభలో అఖిల భారత కిసాన్‌ సభ (అజరు భవన్‌) నేత రావుల వెంకయ్య, బికెఎంయు నేతలు విజయేంద్ర సింగ్‌ నిర్మల్‌, గుల్జార్‌ సింగ్‌ గోరియ ఎఐఎడబ్ల్యుయు నేత విక్రమ్‌ సింగ్‌ తదితరులతో కూడిన భారత బృందం పాల్గంది.

➡️