‘లోకో పైలట్లు క్రికెట్‌ చూస్తున్నారనడానికి ఆధారాల్లేవు : రైల్వే శాఖ తాజా సర్క్యులర్‌

May 3,2024 01:12 #andrapradesh, #Train Accident

చెన్నై : గత ఏడాది విజయనగరం జిల్లా కంటకాపల్లిలో రైలు ప్రమాదం జరిగిన సమయంలో లోకో పైలట్లు తమ మొబైల్‌ ఫోన్లలో క్రికెట్‌ చూస్తున్నారంటూ పేర్కొన్న అంశాన్ని రైల్వే శాఖ తన భద్రతా సర్క్యులర్‌లో తొలగించింది. లోకో పైలట్లు క్రికెట్‌ చూస్తున్నారని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో రైల్వే శాఖ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది. నూతన సర్క్యులర్‌లు విడుదల చేసింది. గత ఏడాది అక్టోబర్‌ 29న విజయనగరం జిల్లాలో రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఢకొీన్న ప్రమాదంలో 17 మంది మరణించగా, మరో 34 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో లోకోపైలట్‌ ఎస్‌ఎంఎస్‌ రావు, అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఎస్‌ చిరంజీవి మరణించారు.
ఈ ఏడాది మార్చిలో ‘లోకో పైలట్‌, కో-పైలట్‌ ఇద్దరూ క్రికెట్‌ చూడ్డం వల్ల రైలు ప్రమాదం జరిగింది’ అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఆరోపించారు. రైల్వే మంత్రి ఆరోపణల తరువాత దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. రైల్వే సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు బ్లూటూత్‌ హెడ్‌సెట్‌లను ఉపయోగించకుండా నిషేధిస్తూ ఈ సర్క్యులర్‌లను జారీ చేసింది. గత ఏడాది విజయనగరంలో రైలు ప్రమాదం జరిగిన సమయంలో లోకో పైలట్లు తమ మొబైల్‌ ఫోన్లలో క్రికెట్‌ చూస్తున్నారంటూ దక్షిణ రైల్వే ఈ సర్క్యులర్‌లో దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ‘భద్రతా ప్రోటోకాల్‌ల పట్ల ఈ తీవ్రమైన నిర్లక్ష్యం పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి నిర్లక్ష్యం లెక్కలేనన్ని జీవితాలను ప్రమాదంలో పడేస్తుంది’ అని పేర్కొంది.
దర్యాప్తులో ప్రమాదం సమయంలో లోకోపైలట్లు క్రికెట్‌ చూస్తున్నారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపిన రైల్వే సేఫ్టీ కమిషనర్‌ ప్రంజీవ్‌ సక్సేనా కూడా తన నివేదికలో లోకో పైలట్లు క్రికెట్‌ చూస్తున్నారని పేర్కొనలేదు. దీంతో రైల్వే శాఖ లోకో పైలట్‌లు క్రికెట్‌ చూస్తున్నారనే సిఫార్సును ఉపసంహరించుకుని తాజాగా సర్క్యులర్‌ను జారీ చేసింది. హెడ్‌ఫోన్లు, బ్లూటూత్‌ వంటి పరికరాలను వినియోగించకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని మాత్రమే తెలిపింది. దీంతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఆరోపణలు నిరాధారణమని తేలిపోయింది.

➡️