జమ్ముకాశ్మీర్‌ రాష్ట్ర హోదా, అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేదు : ప్రధాని మోడీ

Apr 13,2024 07:32 #PM Modi, #speech

ఉదంపూర్‌ : జమ్ముకాశ్మీర్‌ రాష్ట్ర హోదా పునరుద్ధరణ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎంతో సమయం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం జమ్ముకాశ్మీర్‌లోని ఉథంపూర్‌ పట్టణంలో జరిగిన బిజెపి ఎన్నికల ప్రచారంలో మోడీ మాట్లాడారు. జమ్ముకాశ్మీర్‌కు ఎప్పుడు రాష్ట్రహోదా ప్రకటిస్తారో, ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారనే విషయాన్ని మాత్రం మోడీ స్పష్టం చేయలేదు. జమ్ముకాశ్మీర్‌కు ఆర్టికల్‌ 370ను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలను ‘మొఘల్‌ మనస్తత్వం’ ఉన్న పార్టీలని వ్యాఖ్యానించారు. ఉధంపూర్‌ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ పోటీ చేస్తున్నారు.
రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం
భారత రాజ్యాంగాన్ని, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గౌరవిస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. రాజ్యాంగాన్ని రద్దు చేయబోమని అన్నారు. శుక్రవారం రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గన్నారు. అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్‌ ఎస్‌సిలు, ఎస్‌టిలపై వివక్ష చూపిందని, ఎమర్జెన్సీ విధించి అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూసిందని మోడీ ఆరోపించారు. ప్రస్తుతం కూడా కాంగ్రెస్‌ దేశవ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తోందని అన్నారు. బార్మర్‌ లోక్‌సభ స్థానం నుంచి బిజెపి తరుపున కేంద్ర సహాయ మంత్రి కైలాష్‌ చౌదరి బరిలో ఉన్నారు.

➡️