అధికారం కోసమే హిందువుల్లో భయాన్ని సృష్టిస్తున్నారు!

May 5,2024 00:12 #coments, #Farooq Abdullah, #PM Modi
  •  ప్రధాని మోడీపై ఫరూక్‌ అబ్దుల్లా విమర్శ

శ్రీనగర్‌ : అధికారాన్ని అంటిపెట్టుకుని వుండేందుకే ప్రధాని నరేంద్ర మోడీ హిందువుల్లో భయాందోళనలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా విమర్శించారు. 2014లో తనను ఈ పదవిలో కూర్చోబెట్టిన సామాన్యుల సమస్యల గురించి అస్సలు మాట్లాడడం లేదని అన్నారు. ఈ ‘విభజించి పాలించు రాజకీయాలు’కు దూరంగా వుండాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎంపి అభ్యర్ధి అగా సయ్యద్‌ రుహుల్లాకు మద్దతుగా శ్రీనగర్‌లోని ఖాన్‌యార్‌ ప్రాంతంలో ఎన్నికల ర్యాలీనుద్దేశించి అబ్దుల్లా శనివారం ప్రసంగించారు. మంగళసూత్రాలు లాక్కుని వాటిని అమ్మి ముస్లింలకు డబ్బిస్తారు అని పదే పదే ప్రచారం చేస్తూ హిందువుల్లో భయాన్ని నెలకొల్పేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. మా తల్లులు, సోదరీమణుల మెడల్లోని మంగళ సూత్రాలు లాక్కునే చెడ్డవాళ్లలా మేం కనిపిస్తున్నామా? అని ఆయన ప్రశ్నించారు. ఇండియా బ్లాక్‌ అధికారంలోకి వస్తే, ప్రజల ఆదాయాలపై పన్నులు వేస్తారని, రెండు ఇళ్లు వుంటే ఒకటి లాక్కుని ముస్లింలకు ఇస్తారని ఏవేవో చెబుతున్నారని అన్నారు. ‘ముస్లింలు అంటే విద్వేష భావం పాదుకునేలా ప్రధాని వ్యవహరిస్తున్నారు, పైగా ముస్లింలు పిల్లలను ఎక్కువగా కంటారని అంటున్నారు, అనేకమందికి పిల్లలే లేరు, అయిన పిల్లలు లేని ఆయనకు పిల్లల గురించి ఏం తెలుసు? ఆయనకు భార్య అంటే విలువ లేదు, అటువంటప్పుడు పిల్లల విలువ ఎలా తెలుస్తుంది?” అని అబ్దుల్లా ప్రశ్నించారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టాలన్నది ఆయన ప్రయత్నమని, దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పారు. అసత్యాలు ప్రచారం చేసే మోడీని గద్దె దింపాలని అబ్దుల్లా పిలుపునిచ్చారు. సామాన్యులు ఎదుర్కొనే సమస్యల గురించే ప్రధాని ప్రస్తావించడం లేదని విమర్శించారు. పదేళ్లలో అన్ని ధరలు పెరిగిపోయాయి. విద్యుత్‌ లేని ఇళ్లలో కూడా స్మార్ట్‌ మీటర్లు పెట్టేశారని విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా వుండి ఈ విభజన రాజకీయాలను తీవ్రంగా నిరసించాలని కోరారు.

➡️