Kerala: ఎల్‌డిఎఫ్‌-2 ప్రభుత్వానికి మూడేళ్లు

  • హామీలను నెరవేరుస్తున్నాం
  •  ముఖ్యమంత్రి పినరయి విజయన్‌

తిరువనంతపురం : కేరళలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం సోమవారం మూడో వార్షికోత్సవాన్ని నిర్వహించింది. తమ ప్రభుత్వం నాలుగో ఏడాదిలోకి అడుగు పెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం ద్వారా అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతున్నామని చెప్పారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ముఖ్యమంత్రి ఒక పోస్టు పెట్టారు.. ప్రగతిశీల కేరళను సాధించడంలో తన ప్రభుత్వ నిబద్ధతను ఆయన .పునరుద్ఘాటించారు. సామాజిక సంక్షేమం, ఆర్థిక వృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ‘సాంఘిక సంక్షేమం, ఆర్థికాభివృద్ధి సమప్రాధాన్యతతో అమలు చేస్తున్న కేరళ జాతీయ స్థాయిలో ఎన్నో గుర్తింపులు పొందింది. ప్రభుత్వ విద్య, ఆరోగ్యం సహా ప్రాథమిక రంగాలు మరింత బలోపేతం అయ్యాయి. ఐటీలో పెట్టుబడులు రావడంతో పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి స్టార్టప్‌ రంగానికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఉపాధి హామీ పథకం, సామాజిక భద్రత పింఛన్లు, కారుణ్య బీమా సహా ప్రజా సంక్షేమ పథకాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచారు. కొచ్చి వాటర్‌ మెట్రో అభివద్ధి, పారిశ్రామిక రంగంలో జాతీయ రహదారుల అభివద్ధి శరవే గంగా సాగు తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల అభివద్ధిని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. మతతత్వం, మతోన్మాదం అనేక ప్రాంతాల్లో పైచేయి సాధించినప్పుడు.. కేరళలో ప్రజాస్వామ్యం, మత సామరస్యం, మానవత్వం యొక్క గొప్పతనాన్ని నిలబెట్టి ఇతరులకు ఆదర్శంగా నిలిచాము.
వీటన్నింటిని సాధ్యమయ్యేలా ప్రజలు ఇస్తున్న మద్దతు ప్రభుత్వానికి శక్తిని, చైతన్యాన్ని ఇస్తుంది. కొన్ని శక్తులు సంక్షోభం సృష్టించేందుకు ప్రయత్నించినా, ప్రభుత్వం, ప్రజలు పరస్పరం చేయిచేయి కలపడం వల్లనే విజయవంతంగా ముందుకు సాగుతున్నామని’ సిఎం విజయన్‌ పేర్కొన్నారు. మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ హితం కోసం ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు.

➡️