మత ఉద్రిక్తతలు సృష్టించేందుకే : ప్రధాని మోడీ, యుపి సిఎం యోగి తీరుపై ఏచూరి

  • రాజకీయ ప్రాజెక్టుగా రామ మందిర ప్రారంభోత్సవం
  • ప్రధాని మోడీ, యుపి సిఎం యోగి తీరుపై ఏచూరి
  • కేంద్రం తీరు రాజ్యాంగానికి, లౌకికవాద స్ఫూర్తికి, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని వ్యాఖ్య

తిరువనంతపురం : ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూని తప్పుపట్టారు. మత ఉద్రిక్తతను సృష్టించేందుకే రామ మందిర ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోడీ, ఉత్తర ప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాథ్‌ రాజకీయ కార్యక్రమంగా మార్చారని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం మోహరించటం ద్వారా కేంద్రం రాజ్యాంగానికి, లౌకికవాద స్ఫూర్తికి, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ”మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే, రామమందిర ప్రారంభోత్సవాన్ని ప్రధాని, యుపి ముఖ్యమంత్రి చేయాలను కుంటే, ఇందుకు మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగిస్తే.. దానర్థం రాష్ట్రాన్ని ఒక నిర్దిష్ట మతంతో గుర్తిస్తున్నారు. అది భారత రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం” అని ఆయన అన్నారు.

కేరళ కాసర్‌గోడ్‌లోని చెంగాల గ్రామ పంచాయతీలో సిపిఎం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన పాలస్తీనా సంఘీభావ సభను ప్రారంభించిన అనంతరం ఏచూరి మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి 22న జరిగే అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమ ప్రతినిధులను పంపేది లేదని సిపిఎం ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసింది. గత వారం అయోధ్య ఆలయ నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను అప్పగించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం కమిటీ న్యూఢిల్లీలోని సిపిఎం ప్రధాన కార్యాలయానికి వచ్చినట్టు ఏచూరి తెలిపారు. ”నిర్మాణ కమిటీ అధినేత వెంట విహెచ్‌పి నేత ఉన్నారు. వారు నన్ను ఆహ్వానించారు. అప్పుడు నన్ను హాజరవుతారా.! అని అడిగారు. నేను లేదని చెప్పాను” అని ఏచూరీ అనటంతో సభ చప్పట్లతో మార్మోగింది. ఆలయ ప్రారంభోత్సవాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చారని రామమందిరం ట్రస్టు నేతలకు చెప్పినట్టు ఆయన తెలిపారు.

రాజ్యం ఏదైనా నిర్దిష్ట మతాన్ని ప్రకటించదు, పోషించదు అని ఏచూరి అన్నారు. హిందూత్వ పటిష్టత కోసం మత వర్గాల మధ్య వైషమ్యాలు పెంచే పరిస్థితి ఏర్పడుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ”తమ లక్ష్యాన్ని సాధించటానికి జియోనిజం, హిందూత్వ రెండూ చరిత్రను మళ్లీ రాస్తాయి. అవి మన చారిత్రక పరిణామాన్ని నాశనం చేస్తాయి. పాఠ్యపుస్తకాలు మారాయి. కొత్త చరిత్ర కనుగొనబడింది. అది మైనారిటీలపై ద్వేషాన్ని వ్యాప్తి చేయటంపై ఆధారపడింది” అని ఏచూరి విమర్శించారు. జియోనిజం, హిందూత్వ మధ్య ఉన్న సైద్ధాంతిక సాన్నిహిత్యం అనేది అక్టోబర్‌ 7 దాడి తర్వాత ప్రధాని మోడీ ఇజ్రాయెల్‌కు తక్షణ మద్దతును అందించడానికి దారితీసిందని తెలిపారు. పాలస్తీనా ఆందోళనకు భారత్‌ సాంప్రదాయిక మద్దతును పునరుద్ఘాటించడానికి రెండు వారాల కంటే ఎక్కువ సమయం పట్టిందన్నారు. మోడీ ప్రభుత్వం తన సొంత హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్లటానికి అమెరికా, ఇజ్రాయెల్‌, భారత్‌ మధ్య బంధాన్ని గత పదేళ్లుగా బలోపేతం చేస్తున్నదని ఆయన విమర్శించారు.

➡️