గ్రామీణ ప్రాంతాల్లో పని హక్కుపై కేంద్రం 

Jan 4,2024 09:22 #Aadhar Card, #AIAWU, #MGNREGS
upadhi hami pathakam funds adhaar link

ఉపాధి హామీకి ఎబిపిఎస్‌ అనుసంధానాన్ని ఉపసంహరించుకోవాలి

కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు

ఎఐఎడబ్ల్యుయు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గ్రామీణ భారతదేశంలో పని హక్కుపై కేంద్ర ప్రభుత్వం దాడి చేయడాన్ని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు) సెంట్రల్‌ వర్కింగ్‌ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే ఆధార్‌ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఎబిపిఎస్‌)కు అనుసంధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. ఎబిపిఎస్‌ విధించిన కారణంగా ఉపాధి హామీ కింద నమోదైన కోట్లాది మంది కార్మికుల పని హక్కును నిరాకరించడాన్ని వ్యతిరేకించింది. ఎబిపిఎస్‌ చర్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం ఎఐఎడబ్ల్యుయు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ విజయరాఘవన్‌, బి వెంకట్‌ ప్రకటన విడుదల చేశారు. ఉపాధి హామీ కింద పని చేసే హక్కుపై జరుగుతున్న దాడులను ఆపాలని కోరారు. ‘ఎబిపిఎస్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు డేటాబేస్‌ను నవీకరించడానికి గడువు 2023 డిసెంబర్‌ 31తో ముగిసింది. కేంద్ర ప్రభుత్వం తేదీని మరింత పొడిగించలేదు. కేంద్ర ప్రభుత్వం మొదట 2023 జనవరి 30న ఎబిపిఎస్‌ని విధించింది. ఉపాధి హామీ కార్మికులు, వ్యవసాయ కార్మిక సంఘాల నుండి ప్రతిఘటన వ్యక్తమైంది. అయినప్పటికీ ప్రభుత్వం తన నిర్ణయాలను కొనసాగించింది. ఏడాది పొడవునా పొడిగింపులు పొడిగించారు. అయితే కోట్లాది మంది కార్మికులు ఇప్పటికీ ఎబిపిఎస్‌కు అనర్హులుగా ఉన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ డేటా ప్రకారం, జాబ్‌కార్డులో 34.8 శాతం హోల్డర్లు ఇప్పటికీ ఈ చెల్లింపు పద్ధతికి అనర్హులుగా ఉన్నారు’ అని తెలిపారు.ఎబిపిఎస్‌కు అనర్హులుగా వ్యవసాయ కార్మికులు’ఇన్‌యాక్టివ్‌ జాబ్‌ కార్డు హోల్డర్లను అనర్హులుగా కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తోందని వివిధ మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. ఉపాధి హామీ కింద నమోదైన 25.25 కోట్ల మంది వ్యవసాయ కార్మికుల్లో, కేవలం 14.35 కోట్ల మంది క్రియాశీల వ్యవసాయ కార్మికులుగా ఉన్నారు. అనర్హులను ప్రకటించడం పార్లమెంటు ఆమోదించిన ఉపాధి చట్టంలో పొందుపరిచిన కార్మికుల హక్కులకు విరుద్ధం. క్రియాశీల కార్మికులలో 12.7 శాతం మంది ఇప్పటికీ ఎబిపిఎస్‌కు అనర్హులుగా ఉన్నారు’ అని పేర్కొన్నారు.ఉపాధి హామీ ప్రాథమిక స్వభావానికివ్యతిరేకంగా మోడీ సర్కార్‌’కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఎబిపిఎస్‌ను 100 శాతం సాధించాలని రాష్ట్రాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఆధార్‌ చెల్లింపులకు అర్హత లేని కోట్లాది జాబ్‌ కార్డులను (7.6 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు) రాష్ట్రాలు తొలగించాయని క్షేత్రస్థాయి నివేదికలు వెల్లడిస్తున్నాయి’ అని తెలిపారు. ‘జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కోసం తీసుకొచ్చిన ఉపాధి హామీ ప్రాథమిక స్వభావానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. ఉపాధి హామీ గ్రామీణ ప్రజానీకానికి చెందిన అత్యంత పేద, అణగారిన వర్గాలు మనుగడ సాగించేందుకు సహాయపడింది. అదే సమయంలో వ్యవసాయ కార్మికులు, గ్రామీణ కార్మికుల సాధారణ వేతనాలు క్షీణించకుండా నిరోధించబడ్డాయి. చాలా ప్రాంతాల్లో వేతనాలు స్థిరంగా ఉన్నాయి. నగదు పరంగా పెరుగుదల ఉంది’ అని పేర్కొన్నారు.

➡️