ఉత్తుత్తి హామీలే…

Apr 10,2024 03:35 #2024 elections, #guarantees, #PM Modi
  • పదేళ్ల పాలనలో అన్ని వర్గాలకూ మొండిచెయ్యే
  •  ఆందోళనకరంగా పేదరికం, నిరుద్యోగం
  •  అన్నదాతలకు అందని చేయూత శ్రీ మహిళలపై పెరుగుతున్న నేరాలు
  •  మరోసారి ఓట్ల వేటకు సిద్ధమవుతున్న కమలదళం

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి తన ఎన్నికల ప్రణాళికను ఆకర్షణీయంగా రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో ప్రధానంగా పేదలు, యువకులు, రైతులు, మహిళలపై దృష్టి సారించే అవకాశముంది. నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఆయా వర్గాలపై బిజెపి హామీల వర్షం కురిపించింది. అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత వాటన్నింటినీ గాలికి వదిలేసింది. బిజెపి పదేళ్ల కాలంలో ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఎన్నికలు తరుముకొచ్చే సరికి పేదలు, అన్నదాతలు, మహిళలు, యువత గుర్తొచ్చారు.
పాక్‌, బంగ్లా కంటే పేదరికం అధికం
నీతి ఆయోగ్‌ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం గత తొమ్మిదేళ్లలో 24.82 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారు. పేదరిక నిష్పత్తి 2013-14లో 29.17% ఉండగా 2022-23 నాటికి గణనీయంగా తగ్గి 11.28%కి చేరుకుంది. కోవిడ్‌ సమయంలో పెరిగిన పేదరికాన్ని ఈ నివేదిక పరిగణనలోకి తీసుకోలేదని నిపుణులు తెలిపారు. వినియోగ పేదరిక రేఖ (అంతర్జాతీయంగా పేదరికాన్ని అంచనా వేసేందుకు అవలంబించే సంప్రదాయ పద్ధతి) సమాచారాన్ని తీసుకోలేదని మరి కొందరు ఎత్తిచూపుతున్నారు. గత ఆరేళ్లుగా దేశంలో వాస్తవ వేతనాల్లో పెరుగుదల కన్పించడం లేదు. అవి స్థిరంగానే ఉన్నాయి. ఈ పరిణామం వినియోగ డిమాండ్‌పై ప్రభావం చూపింది.
ప్రపంచబ్యాంక్‌ తెలిపిన వివరాల ప్రకారం పేదరిక రేటు, అంతర్జాతీయ దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న ప్రజల దామాషా 2018 వరకూ నిలకడగా తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత పెరుగుదల కన్పించింది. 2020లో… అంటే కోవిడ్‌ సమయంలో గరిష్ట స్థాయికి చేరింది. 2021లో మళ్లీ తగ్గింది. మన దేశంలో పేదరిక రేట్లు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌తో పోలిస్తే బాగా అధికంగా ఉన్నాయి.
అభద్రతలో యువత
యువతకు ఉపాధి కల్పించే విషయంలో మోడీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది. దేశంలో నిరుద్యోగులుగా ఉన్న వారిలో 83% మంది యువతేనని ఇండియా ఎంప్లాయిమెంట్‌ నివేదిక-2024 తెలిపింది. దీనిని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ (ఐహెచ్‌డి) సంయుక్తంగా రూపొందిం చాయి. దేశంలోని మొత్తం నిరుద్యోగ యువతలో సెకండరీ, ఉన్నత విద్య అభ్యసించిన వారి సంఖ్య 2000 సంవత్సరం నుండి 2022 నాటికి రెట్టింపు అయింది. రెగ్యులర్‌ ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య 2018 తర్వాత బాగా తగ్గడం గమనార్హం. యువతలో కొద్దిమంది మాత్రమే సామాజిక భద్రతా పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రయోజనాలు పొందారు. అత్యధికులు మాత్రం అభద్రతతో జీవితాలు నెట్టుకొస్తున్నారు.
నత్తనడకన నడుస్తున్న రైతు పథకాలు
ఇక రైతుల విషయానికి వస్తే వాస్తవానికి వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. వీటిలో 2016లో ప్రారంభించిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన ఒకటి. ప్రీమియంకు సంబంధించి ఇది ప్రపంచంలోనే మూడో అతి పెద్ద పథకం.
ఈ పథకానికి దరఖాస్తు చేస్తున్న అన్నదాతల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. అదే సమయంలో క్లెయిముల చెల్లింపు తగ్గిపోతోంది. 2018-19లో రూ.28,651.8 కోట్ల క్లెయిముల చెల్లింపు జరిగితే 2021-22 నాటికి ఆ మొత్తం రూ.14,716.9 కోట్లకు తగ్గిపోయింది. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి కార్యక్రమాలు కూడా ఇలాగే నడుస్తున్నాయి. ఆయా పథకాల్లో లబ్దిదారుల సంఖ్య క్రమేపీ పడిపోతోంది. బడ్జెట్‌ కేటాయింపులు, ఖర్చు కూడా నానాటికి తీసికట్టు నాగంబొట్టు మాదిరిగా తయారయ్యాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉద్యోగాల కల్పన కోసం నానాటికీ డిమాండ్‌ పెరుగుతుంటే ఉద్యోగాలు పొందిన వారి సంఖ్యలో మాత్రం పెద్దగా పురోగతి కన్పించలేదు. ఉద్యోగాల కోసం డిమాండ్‌ 41% పెరగ్గా ఇచ్చిన ఉద్యోగాలలో పెరుగుదల కేవలం 38% మాత్రమే.
తగ్గుతున్న మహిళా ఉద్యోగులు
మహిళా సాధికారత విషయంలో కేంద్ర ప్రభుత్వ మాటలకు, చేతలకు మధ్య ఏ మాత్రం పొంతన ఉండడం లేదు. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల సంఖ్య అనేక దశాబ్దాలుగా తగ్గుతూ వస్తోంది. గత తొమ్మిది సంవత్సరాల్లో ఈ ధోరణి మరింత అధికమైంది. ప్రపంచబ్యాంక్‌ సమాచారం ప్రకారం 2012 నాటికి 27% మంది మహిళలు ఉపాధి పొందుతుంటే 2021 నాటికి అది 22.9%కి పడిపోయింది. ఈ తిరోగమన ధోరణి ఆందోళన కలిగించే విషయమే.
మహిళలపై పెరుగుతున్న నేరాలు
జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ఇటీవల విడుదల చేసిన వార్షిక నేర నివేదిక ప్రకారం దేశంలో మహిళలకు భద్రత కరువవుతోంది. 2022లో మహిళలపై నేరాలకు సంబంధించి 4,45,256 కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతి గంటకు సుమారు 51 ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతున్నాయన్న మాట. 2020లో 3,71,503 కేసులు నమోదు కాగా, 2021లో వాటి సంఖ్య 4,28,278కి పెరిగింది.

➡️