నోటీసు చూసి షాకయ్యా

మాజీ మంత్రి, బిజెపి ఎంపి జయంత్‌ సిన్హా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గనలేదంటూ పార్టీ ఇచ్చిన షోక్‌ నోటీసుపై బిజెపి సీనియర్‌ నేత, హజారీబాగ్‌ ఎంపి జయంత్‌ సిన్హా స్పందించారు. షోకాజ్‌ నోటీసు చూసి ఆశ్చర్యపోయానన్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయలేదని, ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గనలేదో వివరణ అడుగుతూ బిజెపి జార్ఖండ్‌ ప్రధాన కార్యదర్శి ఆదిత్య సాహు షోకాజ్‌ నోటీసు జారీ చేశారన్నారు. వ్యక్తిగత కారణాత రీత్యా తాను విదేశాల్లో ఉండటంతో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు ఉపయోగించుకున్నట్లు తన సమాధానంలో పేర్కొన్నారు. షోకాజ్‌ నోటీసుపై రెండు పేజీల వివరణతో కూడిన లేఖను జయంత్‌ సిన్హా విడుదల చేశారు. షోకాజ్‌ నోటీసు చూడగానే తాను షాకయ్యానని, ఆ లేఖ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో మరింత ఆశ్చర్యానికి గురయ్యానని సిన్హా పేర్కొన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయబోనని తాను ఈ ఏడాది మార్చి 2న ప్రకటించిన విషయాన్ని లేఖలో పొందుపర్చారు. బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డాతో మాట్లాడిన తరువాత ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
హజారీబాగ్‌ అభ్యర్థిగా పార్టీ మనీష్‌ జైస్వాల్‌ను ప్రకటించిందని, మార్చి8న ఆయనకు తాను అభినందనలు తెలిపడంతో ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపానన్నారు. తాను ఎన్నికల ప్రచారంలో పాల్గనాలని పార్టీ భావించి ఉంటే తనను సంప్రదించి ఉండేవారని,పార్టీ ఎంపి, ఎమ్మెల్యే, పార్టీ ముఖ్య నాయకులు ఎవరూ తనను సంప్రదించలేదని సిన్హా లేఖలో పేర్కొన్నారు. పార్టీ బహిరంగ సభలు, సంస్థాగత సమావేశాలకు తనను పిలవలేదన్నారు.

➡️