ప్రజా కోర్టులోనూ బిజెపిని ఓడిస్తాం

Feb 16,2024 07:38 #AIAWU, #AIKS, #BJP Failures
We will defeat BJP in public court as well aiks

కేంద్ర ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి గ్రామీణ బంద్‌ జయప్రదం చేస్తాం

ఎఐకెఎస్‌, ఎఐఎడబ్ల్యుయు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో నల్లధనాన్ని నివారించే పేరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల బాండ్లు సేకరించాలని తెచ్చిన విధానాన్ని రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీసుకున్న చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నామని జాతీయ కిసాన్‌ సభ నేత హన్నన్‌ మొల్లా, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ తెలిపారు. గురువారం నాడిక్కడ ఎపి, తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి ఇచ్చినట్లుగా ఉందని అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్రప్రభుత్వ నిర్ణయం ఉందని సర్వోన్నత న్యాయస్థానమే వ్యాఖ్యానించిందని, ఈ తీర్పుతో బిజెపి కార్పొరేట్ల పార్టీ అని తేలిందని అన్నారు. ఓట్లను కొనుగోలు చేయడానికి ఎన్నికల బాండ్ల పేరుతో బిజెపికి కార్పొరేట్లు వేల కోట్ల రూపాయల నిధులను సిద్ధం చేశారని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల ప్రజా కోర్టులోనూ మోడీ ప్రభుత్యాన్ని ఓడిస్తామని తెలిపారు. బిజెపి పదేళ్ల క్రితం నుంచి ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే పోలీసు, పారా మిలటరీ దళాలను పెట్టి, రోడ్లపై మేకులు కొట్టి, కంచెలు వేసి రైతులను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇంటర్నెట్‌ బంద్‌ చేసి, లాఠీఛార్జ్‌ చేస్తున్నారని, వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో న్యాయ సమ్మతమైన డిమాండ్స్‌ కోసం ఆందోళన చేస్తున్న రైతులపై మోడీ ప్రభుత్వం నిరంకుశత్వం ప్రదర్శిస్తూ కాశ్మీరీలపై వాడిన పెల్లెట్స్‌ వాడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, వ్యవసాయ కార్మికులు శుక్రవారం గ్రామీణ భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నాయని, సెక్టోరియల్‌ సమ్మెలో ట్రేడ్‌ యూనియన్లు పాల్గొంటున్నాయని చెప్పారు. మోడీ ప్రభుత్వ కార్పొరేట్‌, మతోన్మాద విధానాలపై పోరాటం కోనసాగిస్తామని తెలిపారు. 21 డిమాండ్ల కోసం రైతులు పోరాడుతున్నారని తెలిపారు. ఉపాది హామీ బడ్జెట్‌ 2 లక్షల కోట్లకు పెంచాలని, వేతనాలు పెంచాలని, ఉపాధి హామీ పని దినాలు 200 రోజులకు పెంచాలని, లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్స్‌ ఈ బంద్‌లో ఉన్నాయని వారు తెలిపారు.

స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయకుండా ఆయనకు భారతరత్న ప్రకటించడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్నారు. ఆయన కుమార్తె, ఆర్థిక వేత్త మధుర స్వామినాథన్‌ రైతులకు సి2 ప్లస్‌ 50 శాతం ప్రకారం మద్దతు ధర ఇవ్వాలని, రైతుబీమా వంటి పథకాల ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపర్చాలని కోరారన్నారు. అలా చేసినప్పుడు మాత్రమే ఆయనకిచ్చిన భారతరత్న లక్ష్యం నెరవేరుతుందని తేల్చిచెప్పారు. నేడు గ్రామీణ బంద్‌ విచ్ఛిన్నం చేయడానికి బిజెపి చర్చలు, మంత్రుల కమిటీ పేరుతో కాలయాపన చేస్తుందని, ఎన్ని ప్రయత్నాలు చేసినా శుక్రవారం గ్రామీణ బంద్‌ను రైతులు, వ్యవసాయ కార్మికులు విజయవంతం చేస్తారని తెలిపారు. మీడియా సమావేశంలో కిసాన్‌ సభ జాతీయ కమిటీ సభ్యులు మనోజ్‌ పాల్గొన్నారు.

➡️