‘ఉపాధి’ వేతనాలను రూ.400కు పెంచుతాం : రాహుల్‌గాంధీ

May 7,2024 00:33 #Rahul Gandhi

అలిరాజ్‌పూర్‌ : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) కింద ఇచ్చే వేతనాలను రోజుకు రూ.400కు పెంచుతామని ఆ పార్టీ నాయకులు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. సోమవారం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని రత్లామ్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అలిరాజ్‌పూర్‌ పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘శతకోటీశ్వర్లకు రుణాలను మాఫీ చేస్తూ దానినే అభివృద్ధి అని గొప్పలు చెబుతున్నారు. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కింద మీకు రోజుకు రూ.250 వస్తుందని మా దృష్టికి వచ్చింది. మేం అధికారంలోకి రాగానే రోజుకు రూ.400 వేతనాలు ఇస్తాం’ అని రాహుల్‌ చెప్పారు. ఆ తరువాత ఖర్గాన్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని సెగాన్‌ పట్టణంలో ఎన్నికల ర్యాలీలోనూ ఆయన పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపికి 150 స్థానాలు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రక్షించడానికి చేస్తున్న పోరాటానికి ప్రజలంతా మద్దతు పలకాలని కోరారు.

➡️