హర్యానా కొత్త సిఎం నయాబ్‌ సింగ్‌ సైనీ

Mar 12,2024 15:46 #Haryana CM, #Nayab Singh Saini, #New CM

చండీగఢ్‌ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా రాజకీయాలు వేడెక్కాయి. సీట్ల సర్దుబాటులో హర్యానా డిప్యూటీ సిఎంకి, సిఎం మనోహర్‌ ఖట్టర్‌కి ఒప్పందం కుదరకపోవడంతో.. ఖట్టర్‌ తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. ఆయన తన పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటల తర్వాత తదుపరి హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్‌ సింగ్‌ సైనీని బిజెపి ప్రకటించింది. ఓబిసి కమ్యూనిటీకి చెందిన సైనీ క్షురుక్షేత్ర లోక్‌సభ ఎంపి. ఈయన గతేడాది అక్టోబర్‌లో హర్యానా బిజెపి చీఫ్‌గా నియమితులయ్యారు. మనోహర్‌ ఖట్టర్‌గా సన్నిహితుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు.

కాగా, సైనీ మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన హర్యానాలో బిజెపి బలోపేతమయ్యేందుకు కృషి చేశాడు. 2002లో అంబాలా బిజెపి యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2005లో జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2012లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇక 2014లో నారాయణగర్‌ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016లో రాష్ట్ర మంత్రిగా పని చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సైనీ కురుక్షేత్ర నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. అతను కాంగ్రెస్‌ అభ్యర్థి నిర్మల్‌ సింగ్‌పై దాదాపు 4 లక్షల ఓట్లతో గెలుపొందారు.

➡️