మణిపూర్‌లో పర్యటించండి

Mar 11,2024 10:48 #Manipur violence, #Protest

మోడీని కోరుతూ మణిపూర్‌ యువతి నిరాహార దీక్ష
న్యూఢిల్లీ : గత సంవత్సరం మే నుండి మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసికెళ్లేందుకు దేశ రాజధానిలో 26 సంవత్సరాల మాలెమ్‌ తంగమ్‌ నిరాహార దీక్ష ప్రారంభించి మూడు వారాలు గడిచిపోయాయి. మణిపూర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించాలని, శాంతిని, సాధారణ పరిస్థితులను నెలకొల్పే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఆమె కోరుతున్నారు. ఆపరేషన్స్‌ నిలిపివేతపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, కుకీ గ్రూపుల మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయాలని కూడా ఆమె డిమాండ్‌ చేస్తున్నారు. తంగమ్‌ గత నెల 22న తన స్నేహితులతో కలిసి ఢిల్లీ యూనివర్సిటీలో నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆ తర్వాత ఆమె వివిధ రూపాల్లో తన నిరసనను తెలియజేశారు. ఫిబ్రవరి 27న తిరిగి మణిపూర్‌ చేరుకున్నప్పటికీ ఇంఫాల్‌లో దీక్షను కొనసాగించారు. ఆత్మహత్యకు పూనుకున్నారన్న ఆరోపణపై మణిపూర్‌ పోలీసులు ఆమెను ఈ నెల 2న అరెస్ట్‌ చేశారు. ఐదవ తేదీని విడుదల చేసి తిరిగి 6న అరెస్ట్‌ చేశారు. ప్రజా జీవనానికి ఆటంకం కలిగేలా నిరసల తెలిపారంటూ ఆరోపణ మోపారు. తంగమ్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. అయితే చికిత్సకు నిరాకరించిన తంగమ్‌ తన దీక్షను కొనసాగిస్తున్నారు.

➡️