అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగిస్తే పతనం ఖాయం

– వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్‌

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:అంగన్‌వాడీ మహిళలపై ఎస్మా ప్రయోగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ తప్పుపట్టారు. గుంటూరులోని సిపిఎం కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మహిళలపై ఎస్మా ప్రయోగిస్తానన్న ఏకైక సిఎం జగన్‌ ఒక్కరే అన్నారు. ఇది నియంతృత్వ ధోరణికి నిదర్శనమని తెలిపారు. అంగన్‌వాడీల్లో ఎక్కువ మంది ఎస్‌సి, ఎస్‌టి, బిసి మహిళలే ఉన్నారని, వీరిపై ఎస్మా ఉపయోగించడం ద్వారా సామాజిక న్యాయం పదానికి జగన్‌ చెల్లుచీటి ఇచ్చినట్టేనని అన్నారు. ప్రధాని మోడీ కనుసన్నల్లో పని చేస్తున్న జగన్‌ ఓట్ల కోసం ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలపై కపటప్రేమ కనబరుస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బిజెపిని, బిజెపికి మద్దతు ఇచ్చే పార్టీలను ఓడించాలని రెండు రోజులపాటు గుంటూరులో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయించామని వెల్లడించారు. వ్యవసాయ రంగాన్ని బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. గత పదేళ్లుగా రైతులు, వ్యవసాయ కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులకు, కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు రూ.లక్షల కోట్లు రుణాలు ఇవ్వడం, వారు చెల్లించకుండానే మాఫి చేయడం మోడీ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేయాల్సిన అవసరమన్నారు. పేర్కొన్నారు. ఈ నెల 15 వరకు జనజాగరణ సదస్సులు, 26న దేశ వ్యాప్తంగా ట్రాక్టర్‌ ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయ రంగ సమస్యలపై ఫిబ్రవరి 16న దేశ వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో కార్మికులతో ర్యాలీలు, సదస్సులు, హర్తాళ్‌, గ్రామీణ బంద్‌ నిర్వహించనున్నట్టు చెప్పారు. 2024 ఎన్నికల్లో బిజెపి ఓడించాలని దేశ వ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో బిజెపితో అంటకాగుతున్న వైసిపి, టిడిపి, జనసేనపార్టీలకు ప్రజలు బుద్దిచెప్పాలని కోరారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఆదానీ, అంబానీలకు రెడ్‌ కార్పొట్‌ పరుస్తోందని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులకు ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గాయన్నారు. యంత్రాలతో పనులు లేకుండాపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసి లక్షల మంది కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. కనీస వేతనచట్టం అమలుపై సిఎం జగన్‌ ఇంతవరకు పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమనిఅప్పారావు తదితరులు పాల్గొన్నారు.

➡️