అక్రమార్కులు బిజెపిలో చేరితే శుద్ధులైపోతారా? – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

Mar 26,2024 23:05 #cpi ramakrishna, #press meet

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:తీవ్ర అవినీతి, అక్రమాలకు పాల్పడినప్పటికీ బిజెపిలో చేరగానే శుద్ధులైపోతారా? అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి మద్యం కేసులో జైలుకు పంపిన బిజెపి ప్రభుత్వం, భారీ మైనింగ్‌ అక్రమాలకు పాల్పడి, జైలుకెళ్లి ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటున్న గాలి జనార్ధనరెడ్డిని మాత్రం బిజెపిలో చేర్చుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను మోడీ సర్కార్‌ ఏడాదిగా కక్షపూరితంగా జైల్లోనే ఉంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో రూ.వేల కోట్లు అక్రమాలకు పాల్పడ్డ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి.. కేంద్ర హోంశాఖకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు, వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వం తనకు అనుకూలమైనవారు ఎన్ని అక్రమాలు చేసినప్పటికీ అక్కున చేర్చుకుంటుందని విమర్శించారు. బిజెపి కక్షపూరిత విధానాలను ప్రజాతంత్ర వాదులంతా తీవ్రంగా ఖండించాలని కోరారు.

➡️