‘ఉక్కు’ ప్రయివేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గాలి

Jan 13,2024 21:00 #ukkunagaram, #visakha steel

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం): స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణపై మోడీ సర్కారు వెనక్కి తగ్గాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు హెచ్చరించారు. ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారానికి 1067వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్‌ ఎస్‌ఎంఎస్‌ – 2 కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ నాయకులు యు.రామస్వామి, మరిడయ్య మాట్లాడారు. ఉక్కు ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మలిచేందుకు అన్ని కార్మిక సంఘాలూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లోపు స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకుంటే కార్మికవర్గం తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ ప్రయివేటీకరణను కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని అన్నారు. సుదీర్ఘకాలంగా ఉక్కు పరిరక్షణ పోరాటం కొనసాగుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దీక్షల్లో ఎస్‌ఎంఎస్‌ -2 విభాగం కార్మికులు సతీష్‌, జగదీష్‌, సన్యాసిరావు, మాణిక్యాలరావు తదితరులు కూర్చున్నారు.

➡️