ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పారా? : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు

Jan 30,2024 14:35 #ayyanna patrudu, #press meet

విశాఖపట్నం: భూములను కబ్జా చేయడమే వైసిపి పనిగా పెట్టుకుందని టిడిపి సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పారా? అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. విశాఖపట్నంలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయ్యన్న మాట్లాడారు. ”వైసిపి నేతలు భూములు కనిపిస్తే బెదిరించి లాక్కుంటున్నారు. ఆ పార్టీ నేతల అక్రమాలు, దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయింది. ఈ నాలుగున్నరేళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేశారని సభ పెట్టారు? విశాఖ బీచ్‌ రోడ్డు నుంచి భీమిలి వెళ్లే వరకు ప్రభుత్వ భూములను మిగిల్చారా? ఇక్కడి ప్రజలు ఎందుకు మీకు ఓట్లేయాలి? భూములు దోచుకున్నందుకా? వదిలిపెట్టేదే లేదు.. మూడు నెలల తర్వాత అందరి లెక్కలు తీస్తాం. ఎన్నికల తర్వాత జగన్‌ లండన్‌, అమెరికాలో దాక్కున్నా లాక్కొస్తాం.. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం.జగన్‌కు తల్లి, చెల్లి, బాబారు అనే తేడా లేదు.. నేనో లెక్కా. షర్మిలను అంతమొందించినా ఆశ్చర్య పడక్కర్లేదు. ఆమెకు భద్రత పెంచాలి. రాజశేఖర్‌రెడ్డి ఆస్తిలో షర్మిలకు వాటా రాశారు. అది జగన్‌ ఇవ్వడం లేదు. నాకూ ప్రాణహాని ఉంది. రివాల్వర్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేశా. గన్‌మెన్‌ను ఇస్తానని ఎస్పీ అంటే నేనే వద్దనేశా. ఎక్కడ ఉన్నానో గన్‌మెన్‌లే సమాచారం ఇస్తారని వద్దని చెప్పా. అనకాపల్లి ఎంపీ స్థానానికి నా కుమారుడు దరఖాస్తు చేశారు. ఆ అంశం అధిష్ఠానం పరిశీలిస్తోంది” అని అయ్యన్నపాత్రుడు తెలిపారు.

➡️