ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతోంది: సీపీ

Dec 23,2023 15:05 #mahanthi mahesh

హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి వెల్లడించారు. త్వరలో ఈ కేసుపై వివరాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. సైబరాబాద్‌ వార్షిక నేర నివేదికను సీపీ శనివారం విడుదల చేశారు. కమిషనరేట్‌ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈసారి సైబర్‌ క్రైమ్‌ కేసులు పెరిగాయన్నారు. ”అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కమిషనరేట్‌ సిబ్బంది 2 నెలలు సమర్థంగా పని చేశారు. గతేడాది సైబర్‌ క్రైమ్‌లు కేసులు 4,850 కేసులు ఉంటే.. ఈసారి 5,342 కేసులు నమోదయ్యాయి. రూ.232 కోట్ల నగదు మోసం జరిగింది. డ్రగ్స్‌ కేసులు ఈ ఏడాది 277 కేసులు నమోదు కాగా.. 567 మందిని అరెస్టు చేశాం. రెండు పీడీ యాక్టులు నమోదు చేసి, రూ.27.82 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్‌ చేశాం. ఆర్థిక, స్థిరాస్తి నేరాలు కూడా సైబరాబాద్‌లో ఎక్కువగా నమోదవుతున్నాయి. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ ఏడాది మహిళపై నేరాలు పెరిగాయి. అత్యాచారం కేసులు తగ్గాయి. 2022లో 316 అత్యాచారం కేసులు నమోదైతే.. ఈసారి 259 నమోదయ్యాయి.

➡️