ఎవరికీ లేని ఆంక్షలు ఉపాధ్యాయులపైనే ఎందుకు?

Jan 25,2024 08:35 #Dharna, #Teachers, #utf
  • ఇది ఏ ప్రజాస్వామ్యం : యుటిఎఫ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎవరికీ లేని సెక్షన్‌-30 ఆంక్షలు ఉపాధ్యాయులకు, ప్రత్యేకించి తమ సంఘానికి ఎందుకు ఉంటుందో చెప్పాలని యుటిఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ప్రజాస్వామ్య పద్ధతిలో, నిబంధనలకు లోబడి చేసుకునే పోరాటాలకు ఎటువంటి అనుమతి ఇవ్వకుంటే తమ సమస్యలు ఎలా పరిష్కరామవుతాయో ప్రభుత్వం చెప్పాలని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. సమస్యల పరిష్కారానికి శాంతియుత, ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నాలకు పిలుపునిస్తే ముందుగా అనుమతినిచ్చి తరువాత రద్దు చేయడం, ప్రత్యేకించి తమ సంఘం కార్యాచరణకు అనుమతినివ్వకపోవడం ఎలాంటి ప్రజాస్వామ్యమో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. మున్సిపల్‌ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, పిఎఫ్‌ తదితర సమస్యల పరిష్కారానికి రెండు నెలలుగా స్థానిక, జిల్లా స్థాయిలో పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25న రాష్ట్రస్థాయి ధర్నాకు పిలుపు ఇచ్చామని వివరించారు. గతంలో డిసెంబరు 30న రాష్ట్ర ధర్నాకు పిలుపునిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పి ప్రభుత్వం కార్యక్రమాన్ని వాయిదా వేయించిందని తెలిపారు. నేటికీ ఒక్క సమస్య పరిష్కారం కాని పరిస్థితిలో అనివార్యంగా మరోమారు రాష్ట్ర ధర్నాకు పిలుపునిచ్చామని వివరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మున్సిపల్‌ ఉపాధ్యాయ సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించి పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

➡️