ఏజెన్సీలో ఆదివాసీ జన రక్షణ దీక్షలు

Mar 8,2024 21:50 #cpm dharna, #srikakulam

– 10న మన్యం బంద్‌

– సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

ప్రజాశక్తి – యంత్రాంగం :ఆదివాసీల హక్కుల రక్షణ కోసం ఈ నెల 10న చేపట్టనున్న ఏజెన్సీ బంద్‌కు మద్దతుగా సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ జన రక్షణ దీక్షలు చేపట్టారు. జిఒ నెంబర్‌ 3కి చట్ట బద్ధత కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్‌ జారీ చేయాలని, గిరిజన ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలను ఆదివాసీ అభ్యర్థులకే కల్పించాలని, స్పెషల్‌ డిఎస్‌సి విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం, ఏజెన్సీ ప్రత్యేక డిఎస్‌సి సాధన కమిటీ ఈ నెల 10న ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గిరిజన సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఏజెన్సీ బంద్‌కు మద్దతుగా ప్రతి ఒక్కరూ పాల్గని జయప్రదం చేయాలని కోరారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో దీక్షలనుద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలోని వైసిపి సర్కారు పూర్తిగా తలగ్గి గిరిజన చట్టాలను, హక్కులను కాలరాస్తోందన్నారు. గిరిజన ప్రాంత సమస్యలు పరిష్కరించకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను నిర్వీర్యం చేసి ఆదివాసీల బతుకుల్లో చిచ్చుపెట్టిందని విమర్శించారు. గిరిజనులను పట్టించుకోని బిజెపి, వైసిపి, టిడిపి, జనసేనలను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కోరారు. ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ.. ఆదివాసీ మాతృభాష వలంటీర్లను రెన్యువల్‌ చేయాలని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట దీక్షలను సిపిఎం సీనియర్‌ రాష్ట్ర నాయకులు ఎం.కృష్ణమూర్తి ప్రారంబించి మాట్లాడుతూ గిరిజనులకు నష్టం చేసే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్నాయని తెలిపారు. అందులో భాగంగానే ఏళ్ల తరబడి పోరాడి సాధించిన హక్కులను కాలరాస్తూ గిరిజనులకు ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. వన సంరక్షణ పేరుతో బిజెపి ప్రభుత్వం 1/70 చట్టానికి తూట్లు పొడుస్తోందని, ఐదో షెడ్యూల్లో ఉన్న గిరిజన సంపదైన గనులు, ఖనిజాలు, విలువైన భూములను కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు నైవేధ్యంగా పెడుతోందని దుయ్యబట్టారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, గిరిజన నిరుద్యోగులకు స్పెషల్‌ డిఎస్‌సి విడుదల చేయాలని, రద్దు చేసిన జిఒ 3పై ఆర్డినెన్స్‌ ఇవ్వాలని, అటవీ భూముల చట్ట సవరణ రద్దు చేసి 1/ 70 చట్టాన్ని పగడ్బందీగా అమలు చేjలని డిమాండ్‌ చేశారు.

➡️