ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Feb 27,2024 16:30 #AP High Court, #judgement

అమరావతి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. భూసేకరణ ప్రక్రియలో సేకరించిన భూముల్లో ఇచ్చిన ప్లాట్స్‌ను రద్దు చేస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను ధర్మాసనం కొట్టివేసింది. రైతులకు ఇచ్చిన ప్లాట్స్‌ను రద్దు చేస్తూ ఇచ్చిన నోటీసులను కూడా హైకోర్ట్‌ ధర్మాసనం కొట్టేసింది. కమిషనర్‌, డిప్యూటీ తహశీల్దార్‌ ఇచ్చిన నోటీస్‌లు చెల్లవని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్లాట్లను రద్దు చేస్తూ తమకు ఇచ్చిన నోటీసులను హైకోర్ట్‌లో రైతులు సవాల్‌ చేశారు. మంగళవారం విచారణకు రాగా… రైతుల తరపున న్యాయవాదులు కారుమంచి ఇంద్రనీల్‌ బాబు, ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. వీరి వాదనలను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. మొత్తం 862 ప్లాట్లు రద్దు చేస్తూ సీఆర్‌డీఏ నోటీస్‌లు జారీ చేసింది. ఈ నిర్ణయం సీఆర్‌డీఏ చట్టం, మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధమని న్యాయవాదులు వాదనలు వినిపించారు. చట్టంలో మార్పులు తెచ్చామని ప్రభుత్వం చెప్పింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం రద్దు నిర్ణయాన్ని హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

➡️