‘కలలకు రెక్కలు’ పథకం ప్రారంభించిన చంద్రబాబునాయుడు

అమరావతి: అమరావతిలో పేద విద్యార్థినుల ఉన్నత విద్యకు రుణ సౌకర్యం కల్పించేలా టీడీపీ చేయూతను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కలలకు రెక్కల పథకంలో భాగంగా విద్యార్ధినులతో రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..’ మహిళలకు ఆస్తి హక్కు కల్పించామన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు.. డ్వాక్రా సంఘాలను ప్రవేశ పెట్టాం.. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాం.. మేనిఫెస్టోలో మహాశక్తి కార్యక్రమం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మహాశక్తి కార్యక్రమంలో భాగంగా తల్లికి వందనం పేరుతో ఏడాదికి రూ. 20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. దీపం పథకం పేరుతో ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. 18-59 మధ్య వయస్సున్న మహిళలకు ఏడాదికి రూ. 18 వేలు ఇవ్వనున్నామని చంద్రబాబు వెల్లడించారు.

ఇంటింటికి మంచి నీటి కుళాయిలు అందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఇవన్నీ మహిళల కోసం ప్రవేశ పెట్టాం.. ఇప్పుడు విద్యార్ధినుల కోసం కలలకు రెక్కలు పేరుతో మరో పథకం ప్రవేశపెట్టాం.. పేద విద్యార్థినులు కలల సాకారం చేసుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి.. విద్యార్ధినుల ఉన్నత చదువుల కోసం బ్యాంక్‌ లోన్లు తీసుకునేలా మేం సహకరిస్తామన్నారు. విద్యార్థినులు తీసుకునే రుణాలకు వడ్డీ ప్రభుత్వమే కడుతుంది.. యువత విదేశాల్లో సెటిల్‌ అయ్యేలా ఐటీని ప్రొత్సహించాం.. ఐటీ వల్ల ఓటర్లందరూ విదేశాలకు వెళ్లిపోతున్నాయని నన్ను విమర్శిస్తారు అని ఆయన పేర్కొన్నారు. ఓటర్లు విదేశాలకు వెళ్లడం వల్ల రాజకీయంగా నష్టపోతున్నామని అనేవారు.. నేను నష్టపోయినా ఫర్వాలేదు.. తెలుగు జాతి బాగుపడింది.. అదే నాకు సంస్కృతి’ అని చంద్రబాబు చెప్పారు.

➡️