కాలుష్య నియంత్రణకు ఎన్‌టిటిపిఎస్‌ ముట్టడి

Mar 15,2024 20:55 #NTTPS siege, #pollution control

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం (ఎన్‌టిఆర్‌ జిల్లా) :ఎన్‌టిఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్‌టిటిపిఎస్‌ (నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌) వద్ద కాలుష్య ప్రభావిత ప్రాంత ప్రజలు, విద్యార్థులు శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ కేంద్రం నుంచి వెలువడే బూడిద వలన అనేక రోగాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ ఆందోళన కొనసాగింది. ఎన్‌టిటిపిఎస్‌లోకి ఉద్యమకారులు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. గత 50 రోజులుగా పోరాట సమితి సభ్యులు శాంతియుతంగా పోరాటం చేస్తున్న సమయంలో కొత్తగా వచ్చిన విటిపిఎస్‌ చీఫ్‌ ఇంజనీర్‌, ఎపి జెన్‌కో డిఎస్‌పి ఆందోళనకారులను పిలిపించి కేసులు నమోదు చేస్తామంటూ బెదిరించారు. దీంతో విటిపిఎస్‌ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టామని నాయకులు తెలిపారు. యాజమాన్యం దిగొచ్చేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దీంతో విటిపిఎస్‌ అధికారులు దిగొచ్చి పోరాట కమిటీ సభ్యులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కాలుష్య నియంత్రణకు వేగవంతమైన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమకారులపై కవ్వింపు చర్యలకు పాల్పడితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ కాలుష్య ప్రభావిత ప్రాంత ప్రజల సమస్యలను యాజమాన్యం దఅష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, జనసేన, ఎం సిపిఐ నాయకులు, సామాజిక కార్యకర్తలు, స్థానిక ప్రజలు, కాలుష్య నియంత్రణ పోరాట సమితి సభ్యులు పాల్గొన్నారు.

➡️