‘కృష్ణపట్నం’లో కంటైనర్‌ టెర్మినల్‌ కొనసాగించాల్సిందే

Mar 2,2024 08:02 #CH Narsingrao, #speech

–  సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు

ప్రజాశక్తి-నెల్లూరు:అదాని కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్‌ టెర్మినల్‌ను యథావిధిగా కొనసాగించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు డిమాండ్‌ చేశారు. టెర్మినల్‌ తరలింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయకుంటే పోరాటం తప్పదని హెచ్చరించారు. కంటైనర్‌ టెర్మినల్‌ తరలింపును వ్యతిరేకిస్తూ నెల్లూరులో శుక్రవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్మిక, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ప్రదర్శన స్వతంత్ర పార్కు సెంటర్‌ నుంచి ఆర్‌టిసి బస్టాండ్‌ వరకు సాగింది.

ఈ కార్యక్రమంలో సిహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ.. అదాని తన నియంత్రణలోని థర్మల్‌ విద్యుత్‌ స్టేషన్ల అభివృద్ధి కోసం కృష్ణపట్నం పోర్టును బగ్గు మయంగా చేయాలని చూడడం సరికాదన్నారు. కృష్ణపట్నం పోర్టును ఆధారంగా చేసుకొని పలు విభాగాలలో వేల మంది కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. కంటైనర్‌ టెర్మినల్‌ తరలించడం ద్వారా పోర్టులో పని చేస్తున్న కార్మికులపై ఆ ప్రభావం పడుతుందన్నారు. వెంటనే ప్రభుత్వం ఈ ప్రయత్నాలను అడ్డుకొని ఆదాని సంస్థ దుష్టపన్నాగాలను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకు కృష్ణపట్నం పోర్టులో దిగుమతి అవుతున్న గ్రానైట్‌, ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్న గుంటూరు మిర్చి పూర్తిగా నిలిచిపోయాయన్నారు. దీనికి పోర్టులోని కంటైనర్‌ కార్గో పనులు నిలిపివేయడమే ప్రధాన కారణమని తెలిపారు. దీంతో కృష్ణపట్నం పోర్టుకు విదేశాల నుంచి వచ్చే షిప్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. పోర్టులోని కంటైనర్‌ టెర్మినల్‌ను కొనసాగించాలని, ఓడల రాకపోకల షెడ్యూల్‌ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రూరల్‌ కార్యదర్శి కిన్నెర కుమార్‌, కృష్ణపట్నం పోర్టు సిఐటియు కార్మిక సంఘం నాయకులు ఎం.మోహన్‌రావు, గోగుల శ్రీనివాసులు, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.వి.వి. ప్రసాద్‌, కె.అజయ్ కుమార్‌ పాల్గొన్నారు.

➡️