కొనసాగుతున్న నంది నాటకోత్సవాలు

Dec 27,2023 08:57 #guntur, #Nandinatakotsavalu

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలలో భాగంగా నాలుగో రోజు వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు పలు నాటికలను ప్రదర్శించారు. గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బలిజేపల్లి లక్ష్మీకాంతం కళావేదిక ద్వారా నిర్వహిస్తోన్న ఈ నాటకోత్సవాలలో పౌరాణిక కథాంశాలు, సాంఘిక, సామాజిక అంశాలతో పాటు విజ్ఞాన వినోదాల సమ్మేళనంగా ప్రదర్శనలు కొనసాగాయి. నాగశ్రీ రచనకు అన్నెపు దక్షిణామూర్తి దర్శకత్వం వహించిన ‘సీతాకల్యాణం’ పౌరాణిక పద్యనాటకాన్ని కాకినాడకు చెందిన సీతారామాంజనేయ నాణ్యమండలి ప్రదర్శించింది. కథనం క్రియేషన్స్‌, కొండపల్లి క్రాంతి హైస్కూల్‌ వారు ప్రదర్శించిన నాటిక ‘తథాబాల్యం’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. జె.బి. ప్రిస్ట్లి రచనలో ది ఇంపోస్టర్స్‌ (అంతా నిజమే చెబుతారు), హైదరాబాద్‌ మిత్రా క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో ఎన్‌.ఎమ్‌.బాషా రచించన ఆకురాతి భాస్కరాచారి దర్శకత్వంలో రూపొందిన ‘ఇంకానా’?, పిన్నమనేని మృత్యుంజయ రావు రచనకు నాయుడు గోపీ దర్శకత్వంలో గంగోత్రి పెదకాకాని వారు ‘ఆస్తికలు’ నాటికను ప్రదర్శించారు. ‘శ్రీ కృష్ణ – కమలపాలిక’ పద్యనాటకంతో నాలుగోరోజూ ప్రదర్శనలు ముగిశాయి. ఎఫ్‌డిసి చైర్మన్‌ పోసాని కృష్ణమురళీ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ విజరుకుమార్‌ రెడ్డి నాటికలను వీక్షించారు. విజేతలకు బహమతులు, పారితోషికం అందించారు.

➡️