చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవాలని విజిలెన్స్‌ ఐజీ లేఖ ఎలా రాస్తారు?- హైకోర్టు ప్రశ్న

Mar 15,2024 22:15 #AP High Court, #orders

ప్రజాశక్తి-అమరావతి :విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ గెజిటెడ్‌ ఆఫీసర్లకు పలు అధికారాలు కల్పించాలని ఆ శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజి) కొల్లి రఘురామిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ఎలా రాస్తారని హైకోర్టు ప్రశ్నించింది. చట్టబద్ధంగా దఖలు పడాల్సిన అధికారాల గురించి కార్యనిర్వాహక వ్యవస్థలోని అధికారి ఎలా ఉత్తరం రాస్తారని ప్రశ్నించింది. ఐజి వినతితో విస్తృతాధికారాల కల్పన ఎలా వీలుపడుతుందని కూడా ప్రశ్నించింది. 13 చట్టాలపై తమ శాఖ గెజిటెడ్‌ అధికారులకు విస్తృతాధికారాలు కావాలని ఐజి లేఖ రాయడాన్ని ప్రాథమికంగా తప్పుపట్టింది. ఈ వ్యవహారంపై సమగ్ర వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ఏ ఆఫీసులోనైనా ప్రవేశించి తనిఖీలు, జప్తులు, రికార్డుల సీజ్‌, సమాచార సేకరణ వంటివి చేసేందుకు తమకు మరిన్ని అధికారాలు కల్పించాలంటూ ప్రభుత్వానికి విజిలెన్స్‌ ఐజి కొల్లి రఘురామిరెడ్డి ఫిబ్రవరి 5న లేఖ రాశారు. దీనిని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ హైకోర్టులో సవాల్‌ చేస్తూ పిటిషన్‌ వేశారు. ఆ లేఖ ఆధారంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ తీసుకున్న చర్యలు చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని, ఇది టిడిపి నేతలను లక్ష్యంగా చేసుకున్న చర్య అని లోకేష్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మరళీధరరావు వాదించారు. ఐజి లేఖపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి వుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు సుమన్‌, మహేశ్వరరెడ్డి ప్రతివాదన చేశారు. ఆ లేఖపై 13 శాఖాధిపతుల సమ్మతి పొందాలని సిఎస్‌ పేర్కొన్నారని తెలిపారు.

➡️