జనరల్‌ ర్యాంకింగ్‌ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

హైదరాబాద్‌: తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక మండలి (టీఆర్‌ఈఐ-ఆర్‌బీ) ఉద్యోగ నియామకాల్లో రీలింకిష్‌మెంట్‌ విధానం పాటించి.. అవరోహణ క్రమంలో భర్తీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ‘ఎక్స్‌’ వేదికగా లేఖ రాశారు.

”గురుకుల రిక్రూట్‌మెంట్‌ బోర్డు నియామకాలు కొందరికి మోదం, మరికొందరికి ఖేదం మిగిలిస్తున్నాయి. గతేడాది గురుకుల బోర్డు డిగ్రీ లెక్చరర్స్‌, పీజీటీ, టీజీటీ వంటి అనేక ఉద్యోగ నియామకాలకు వరుస నోటిఫికేషన్లు జారీ చేసింది. అర్హత కలిగిన వేలాది మంది నిరుద్యోగులు అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని పరీక్షలు రాశారు. బోర్డు వెల్లడించిన అన్ని ఫలితాల్లో ఒకే అభ్యర్థి.. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అలా ఎంపికైన వారు ఏదో ఒక ఉద్యోగాన్ని ఎంచుకొని మిగతావి వదిలేయాల్సి ఉంటుంది.

అలా వదిలేసిన ఉద్యోగాలు ఖాళీగానే ఉండిపోతున్నాయి. దీంతో మెరిట్‌ లిస్టులో ఉన్న అభ్యర్థులకు తీరని నష్టం జరుగుతుంది.బోర్డు తక్షణమే జనరల్‌ ర్యాంకింగ్‌ ప్రకటించి అవరోహణ క్రమంలో ఉద్యోగాలు భర్తీ చేయాలి. మరోవైపు, ఉద్యోగాలు ఖాళీగా మిగలకుండా ఉండాలంటే అభ్యర్థుల మెరిట్‌ ఆధారంగా రెండో జాబితా విడుదల చేసి భర్తీ చేపట్టాలి” అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కోరారు.

➡️