జనసేనకు గ్లాస్‌ గుర్తు రద్దు చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ

Feb 14,2024 17:01 #adjourned, #AP High Court, #judgement

అమరావతి: జనసేనకు గ్లాస్‌ గుర్తు రద్దు చేయాలన్న పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్‌ జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ దరఖాస్తును పట్టించుకోకుండా ఎన్నికల కమిషన్‌ (ఈసీ) గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయించడాన్ని తన పిటిషన్‌లో తప్పుబట్టారు. హైకోర్టులో విచారణ నేపథ్యంలో ఫ్రీ సింబల్‌ గా ఉన్న గాజు గ్లాస్‌ కోసం తొలుత జనసేన దరఖాస్తు చేసిందని కోర్టుకు ఈసీఐ తెలిపింది. జనసేన, ఈసీఐ కలిసి కుమ్ముక్కై ఇలా చేశారని కోర్టులో పిటిషనర్‌ రాష్ట్రీయ కాంగ్రెస్‌ పార్టీ వాదనలు వినిపించింది. ప్రభుత్వ ఆఫీసు ఉదయం 10 గంటల వరకు తెరవరని దరఖాస్తు స్వీకరణ సమయం 9.15గా ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు. అభ్యంతరాలను కౌంటర్‌ రూపంలో దాఖలు చేయాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.కొద్దిరోజుల కిందట జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసింది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి ఈ-మెయిల్‌ ద్వారా ఉత్తర్వులు పంపించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్ధులు పోటీ చేశారు. అయితే మధ్యలో గాజు గ్లాస్‌ ను ఫ్రీ సింబల్‌ గా ప్రకటించింది ఎన్నికల సంఘం. ఇప్పుడేమో తిరిగి ఆ పార్టీకే ఇవ్వడంపై హై కోర్టును ఆశ్రయించారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్‌. గాజు గ్లాసును ఫ్రీ సింబల్‌ గా 2023లో ఈసీ ప్రకటించిన వెంటనే ఆ గుర్తు కోసం మొదటగా దరఖాస్తు చేశానని పిటిషనర్‌ అంటున్నారు.

➡️