జాతీయ విపత్తుగా ప్రకటించండి- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

ప్రజాశక్తి – ఏలూరు, ఉండి మిచౌంగ్‌ తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.40 వేలు పరిహారమిచ్చి ఆదుకోవాలని, ఈాక్రాప్‌తో సంబంధం లేకుండా కౌలు రైతులందరికీ సాయం అందించాలని, రైతుల పంట రుణాలు రద్దు చేయాలని, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏలూరు జిల్లా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలాల్లో ఆయన గురువారం పర్యటించారు. తడిసిన ధాన్యం రాశులను, మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, తుపాను పంట నష్టాలు తదితర అంశాలపై ఈ నెల 9న విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. అనంతరం ఉండిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు సహకరించాలని కోరారు. ఆయన వెంట సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జాతీయ కార్యదర్శివర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌, గుజ్జుల ఈశ్వరయ్య, తదితరులు ఉన్నారు.

➡️