అంగన్వాడీల సమస్యలు పరిష్కరించండి

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ అంగన్వాడీల ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని రాయచోటి, లక్కిరెడ్డిపల్లి ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శిలు భాగ్యలక్ష్మి, ఓబులమ్మ ఆధ్వర్యంలో అంగన్వాడీలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్స్‌, మినీ వర్కర్స్‌ అనేక సేవలు అందిస్తున్నారని తెలిపారు. అంగన్వాడీలకు పనివారం పెరిగిందని చెప్పారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదన్నారు. వేతనాల పెంపు, గ్రాట్యూటీ అమలు తదితర సమస్యల కోసం గత ప్రభుత్వం ఉన్నప్పుడు 42 రోజుల పాటు తీవ్ర నిర్భంధాన్ని ఎదురుకున్నామని, ఎస్మా లాంటి చట్టాలను ఎదిరించి సుదీర్ఘ సమ్మె చేశామని పేర్కొన్నారు. అనివార్యంగా ప్రభుత్వం కొన్ని జిఒలు ఇచ్చినా ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. గత ప్రభుత్వం జూలైలో వేతనాలు పెంచుతామని మినిట్స్‌ కాపీ ఇచ్చినా అంగన్వాడీ సమస్యలు పరిస్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని 42 రోజులు సమ్మె ముగింపు సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్‌ కాపీలో ఉన్న అన్ని అంశాలు పరిష్కారం చేసి పెండింగ్‌ జిఒలు ఇవ్వాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి త్వరలోనే అంగన్వాడీ సమస్యలపై శుభవార్త చెబుతామని ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అంగన్వాడీ రాయచోటి లక్కీరెడ్డిపల్లె ప్రాజెక్టు అధ్యక్షులు సిద్ధమ్మ, సుకుమారి మండల సెక్టార్‌ నాయకులు, పెద్ద ఎత్తున అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️