జిందాల్‌తో ఎంఒయును రద్దు చేయాలి

Jan 11,2024 08:11 #Dharna, #Steel plant workers
  • స్టీల్‌ప్లాంట్‌ ప్రధాన పరిపాలన భవనం ఎదుట ధర్నా

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : జిందాల్‌తో జరిగిన ఎంఒయును రద్దు చేయాలని, కార్మికులకు నూతన వేతనాలు అమలు చేయాలని, బోనస్‌ చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ స్టీల్‌ సిఐటియు, దాని మిత్రపక్షాల ఆధ్వర్యంలో స్టీల్‌ప్లాంట్‌ ప్రధాన పరిపాలన భవనం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి స్టీల్‌ సిఐటియు గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ… ఉక్కు కార్మికుల సమస్యల పట్ల యాజమాన్యం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం పేరు చెప్పి స్థానిక స్టీల్‌ యాజమాన్యం తనకు పోటీదారుగా ఉన్న జిందాల్‌తో ఒప్పందం చేసుకోవడం విశాఖ స్టీల్‌ ప్రతిష్టకు భంగమేనని విమర్శించారు. ఒప్పందంతో అనేక లాభాలు కలుగుతాయని సిఎమ్‌డి అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని మండిపడ్డారు. అనుమానాలను నివృత్తి చేయకపోవడం దారుణమన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ.. ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమాలు చేస్తుంటే చూసి తట్టుకోలేక కార్మిక వర్గాన్ని ఆర్థికంగా దెబ్బతీయడం కోసం నూతన వేతనాలను అమలు చేయడం లేదన్నారు. స్టీల్‌ సిఐటియు అధ్యక్షులు వైటి.దాస్‌, మిత్రపక్షాల నాయకులు డివి.రమణారెడ్డి, డి.సురేష్‌ బాబు, సిహెచ్‌.సన్యాసిరావు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ యాజమాన్యం అనాలోచిత నిర్ణయాల వల్ల కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. గత సంవత్సరం రూ.9500, ఈ సంవత్సరం రూ.8000ను బోనస్‌గా యాజమాన్యం చెల్లించలేదని తెలిపారు. ఆ సమస్యలను పరిష్కరించకుండా యాజమాన్యంతో గుర్తింపు యూనియన్‌ సహజీవనం సాగిస్తోందని విమర్శించారు. ధర్నాలో నాయకులు పి.శ్రీనివాసరాజు, బి.అప్పారావు, యు.వెంకటేశ్వర్లు, కె.గంగాధర్‌, టివికె.రాజు, మిత్రపక్షాలైన డివిఆర్‌ఎస్‌ఇసి, సిఎఫ్‌టియుఐ, ఎఐసిటియు సంఘాల నాయకులు గల్లా శంకరరావు, కర్ర ప్రకాష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️