డిఎస్‌సి అభ్యర్థుల అర్ధనగ్న ప్రదర్శన

Feb 9,2024 08:08 #DYFI, #nirasana

ప్రజాశక్తి – అనకాపల్లి (అనకాపల్లి జిల్లా): పూర్తి పోస్టులతో మెగా డిఎస్‌సి ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన అనకాపల్లిలో గురువారం డిఎస్‌సి అభ్యర్థులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ముందుగా ఆర్‌టిసి కాంప్లెక్స్‌ నుంచి నాలుగు రోడ్ల జంక్షన్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ, భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ.. డిఎస్‌సి ద్వారా 25వేలు పోస్టులను ప్రకటించి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, 117 జిఒ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 117 జిఒ పేరుతో 3, 4, 5 తరగతులను హైస్కూల్‌లో విలీనం చేయడం ద్వారా 1:40 ఉండే ఉపాధ్యాయ, విద్యార్థి రేషియోను 3 నుంచి 8వ తరగతి వరకు 1:53గా, 9, 10 తరగతులకు 1:60 రేషియోగా ప్రభుత్వం మార్చిందన్నారు. ఈ కారణంగా అదనపు ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పి పాత లెక్కల ప్రకారం 25 వేలున్న పోస్టులను 6100కు ప్రభుత్వం కుదించిందని మండిపడ్డారు. అప్రంటిస్‌ విధానాన్ని రద్దు చేయాలన్నారు. డివైఎఫ్‌ఐ అనకాపల్లి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతకాయల శివాజీ, ఎస్‌వి.నాయుడు మాట్లాడుతూ.. ఐదేళ్ల కాలంలో ఒక్క డిఎస్‌సి కూడా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో కంటి తుడుపు చర్యగా 6,100 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించడం డిఎస్‌సి అభ్యర్థులను మోసగించడమేనన్నారు. మెగా డిఎస్‌సి ప్రకటించాలని, లేకుంటే డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు నాని, దేముడు, తరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️