డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వాలి

Feb 21,2024 08:35 #aidwa, #sadassu

– ఉపాధి అవకాశాలు కల్పించాలి

– ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్‌ పుణ్యవతి

ప్రజాశక్తి – అనకాపల్లి :డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు ఇవ్వాలని, వారు ఆర్థికంగా ఎదిగేందుకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్‌ పుణ్యవతి డిమాండ్‌ చేశారు. విశాఖలో ఈ నెల 22 నుంచి జరగనున్న ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకుని అనకాపల్లి సిఐటియు కార్యాలయంలో మంగళవారం ‘స్వయం సహాయక సంఘాలు – మహిళ సాధికారత’ అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన పుణ్యవతి మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో దాచుకున్న పొదుపు సొమ్ముకు ప్రభుత్వం కేవలం మూడు శాతం వడ్డీ చెల్లించి, వారికిచ్చే రుణాలపై మాత్రం సుమారు రూపాయి వడ్డీ వసూలు చేయడం దారుణమన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు పాల డెయిరీలు, విస్తరాకులు, కుట్టుమిషన్లు వంటి వ్యాపారాలకు ఇచ్చే రుణాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. విఒఎలకు ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని, సంక్షేమ పథకాలపై రాయితీలు ఇవ్వాలని, ఉచితంగా గ్యాస్‌ సరఫరా చేయాలని, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని కోరారు. మహిళా సమస్యలపై ఉద్యమించేందుకు సంఘాలు పటిష్టం కావాల్సిన అవసరముందన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి ప్రభావతి మాట్లాడుతూ గతంలో డ్వాక్రా గ్రూపులకు ప్రభుత్వం రివాల్వింగ్‌ ఫండ్‌ ఇచ్చేదని, నేడు మహిళలు దాచుకున్న పొదుపు సొమ్మును కూడా తీసుకునేందుకు నిరాకరిస్తోందని అన్నారు. డ్వాక్రా మహిళలను రాజకీయ పార్టీలు తమ రాజకీయ సమావేశాలకు, ఇతర కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నాయని, సమావేశాలకు రాకుంటే సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తామని నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇది సరికాదని తెలిపారు. సదస్సులో సంఘం జిల్లా అధ్యక్షులు వరలక్ష్మి, నాయకులు ఆర్‌ లక్ష్మి, మాణిక్యం, సూర్యప్రభ, ఎ వరలక్ష్మి పాల్గొన్నారు.

➡️