తన స్వప్రయోజనాల కోసమే కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు : కోదండరాం

Mar 1,2024 14:43 #Kodandaram, #press meet

హైదరాబాద్‌: బిఆర్‌ఎస్‌ వైఖరి దొంగే దొంగ అన్నట్లుగా ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. నాంపల్లిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పటిష్ఠంగా ఉందనడం విడ్డూరమన్నారు. 3 పిల్లర్లు మాత్రమే కుంగాయని బిఆర్‌ఎస్‌ వితండవాదం చేస్తోందని ధ్వజమెత్తారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టులపై జరిగిన తప్పిదాలపై బహిరంగ చర్చకు సిద్ధమా?మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తితో మార్చి 10న చర్చకు రావాలి. ఊరూరా తిరిగి బిఆర్‌ఎస్‌ బండారం బట్టబయలు చేస్తాం. కాళేశ్వరం కామధేనువు ఎలా అవుతుందో కేసీఆర్‌ చెప్పాలి.

ఆ ప్రాజెక్టు మూడు రకాల సంక్షోభాలకు కారణమైంది. సాగునీరు, ఇంజినీర్‌ వ్యవస్థ, నిధుల సంక్షోభానికి గురైంది’ అని విమర్శించారు. తన స్వప్రయోజనాల కోసమే కేసీఆర్‌ ఈ ప్రాజెక్టు చేపట్టారని కోదండరాం ఆరోపించారు. ఇంజినీర్లతో సంబంధం లేకుండా డిజైన్లు మార్చారని.. వాటికి కేంద్ర జలసంఘం అనుమతులు తీసుకోలేదన్నారు. బ్యారేజీ నిర్మాణానికి మేడిగడ్డ సరైంది కాదని సీడబ్ల్యూసీ చెప్పిందని గుర్తుచేశారు. ఆ హెచ్చరికను కేసీఆర్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. పంప్‌హౌస్‌లు మునుగుతాయని చెప్పినా పట్టించుకోలేదని కోదండరాం అన్నారు.

➡️