తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు- సిఎస్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా కరువు మండలాల్లో తాగునీరు, ఉపాధిహామీ పనుల కల్పనలో ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కరువు మండలాల్లో ఉపాధిహామీ పనులు, తాగునీటి సరఫరాపై శుక్రవారం, ఎన్‌టిఆర్‌ ప్రకాశం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, జలవనరులు, విపత్తుల నిర్వహణ శాఖల అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ఉపాధిహామీ పథకం పనులను ఉదయం 5.30గంటల నుంచి 10.30 గంటల వరకు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి ఎద్దడి ప్రాంతాల్లో ట్యాంకుల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని కలెక్టర్లను సిఎస్‌ ఆదేశించారు. ట్యాంకుల ద్వారా నీటి సరఫరాను పర్యవేక్షించేందుకు వారం రోజుల్లో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. కరువు మండలాల్లోని సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులన్నింటినీ సమీపంలోని నీటి సోర్సుల ద్వారా నీటిని మళ్లించి వాటిని పూర్తిగా నీటితో నింపాలని ఆదేశించారు. భూగర్భ జలమట్టాలను నిరంతరం మానిటర్‌ చేస్తూ నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రతి రోజు ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా చేయాలని పేర్కొన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు సంబంధించి ప్రత్యేకంగా ఎస్‌ఓపి రూపొందించి సక్రమంగా నీటి సరఫరా జరిగేలా చూడాలని సిఎస్‌ కలెక్టర్లను ఆదేశించారు. జలవనరులు, పంచాయితీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు మండలాల్లో తాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు వారం రోజుల్లో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుల వారీగా జలవనరులు, ఆర్‌డబ్ల్యుఎస్‌, మున్సిపల్‌ శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడంతోపాటు అవసరమైన చర్యలు తీసుకుంటామని సిఎస్‌కు వివరించారు. ట్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేసే వాహనాలన్నింటికీ జియో ట్యాగింగ్‌ చేసి, నిరంతరం పర్యవేక్షించడం ద్వారా మంచినీటి వృథాను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కరువు ప్రభావిత 9 జిల్లాల కలెక్టర్లు ఉపాధిహామీ పథకం ద్వారా ప్రజలకు కల్పిస్తున్న పనులు, మంచినీరు సరఫరా చేస్తున్న విధానాలను సిఎస్‌కు వివరించారు. ఈ సమావేశంలో పంచాయితీరాజ్‌శాఖ కమిషనరు కె.కన్నబాబు, విపత్తుల నిర్వహణ సంస్ధ డైరెక్టర్‌ ఆర్‌ కూర్మనాథ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇఎన్‌సి కృష్ణారెడ్డి పాల్గన్నారు. వీరితోపాటు జలవనరులశాఖ ఇఎన్‌సి నారాయణరెడ్డి పాల్గన్నారు.

➡️