తుది ఓటర్ల జాబితాపైనా అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చు

Jan 24,2024 21:38 #AP High Court, #judgement
  • హైకోర్టులో సిఇసి నివేదిక

ప్రజాశక్తి-అమరావతి : ఓటర్లు తుది జాబితాపై అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చునని, అభ్యంతరాలను స్వీకరించి కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) తగిన నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టుకు సిఇసి నివేదించింది. ఇప్పటికే ఓటర్ల జాబితా విడుదల చేశామని చెప్పింది. ఇప్పటి వరకు అందిన అభ్యంతరాలపై చట్ట ప్రకారం సవరణ చేసి తుది జాబితా విడుదల చేసినట్లు నివేదించింది. ఈ వివరాలతో సంతృప్తి చెందిన హైకోర్టు, మచిలీపట్నంలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయనే పిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది.ఒక ఇంట్లో నివాసం ఉండే ఓటర్లందరికీ ఒకే పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు కల్పించాలని, అర్హులకు ఓటు హక్కు నిరాకరించకుండా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలంటూ మచిలీపట్నంకు చెందిన వ్యాపారి ఇ దిలీప్‌కుమార్‌ వేసిన పిల్‌ను బుధవారం చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం విచారణ పూర్తి చేసింది. పిటిషనరు తరఫున న్యాయవాది ఎంవి రమణ కుమారి వాదిస్తూ.. ఒక ఇంట్లోని ఒక కుటుంబానికి చెందిన వాళ్ల ఓట్లు ఒకే పోలింగ్‌ బూత్‌లో ఉండేలా చేయలేదన్నారు. నివాసం ఉన్నవారు రెండు కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్‌ బూత్‌ ఉండాలన్న సిఇసి నిబంధన అమలు కావడం లేదన్నారు. సిఇసి తరఫున సీనియర్‌ న్యాయవాది దేశారు అవినాష్‌రెడ్డి ప్రతివాదన చేస్తూ, తాజాగా విడుదల చేసిన తుది జాబితాపై అభ్యంతరాలు తెలియజేయొచ్చునని చెప్పారు.

➡️