దేశంలో పేట్రేగిపోతున్న మతతత్వ శక్తులు

Feb 24,2024 08:27 #aidwa, #sabha

-తమిళనాడు, కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లో హింస

-రైతులు రోడ్డెక్కితే కాల్పులా? మోడీ సిగ్గుపడాలి

-ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభంలో నేతలు

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : గడిచిన పదేళ్ల కాలంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మినహా దేశమంతటా మతత్వ శక్తులు పేట్రేగిపోయి మహిళలు, రైతులు, కార్మికులకు రక్షణ లేకుండా పోయిందని ఐద్వా జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు పికె.శ్రీమతి, మరియం థావలే అన్నారు. 2024 ఎన్నికల్లో బిజెపి గెలిస్తే భారత్‌ మత దేశంగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. మూడు రోజుల పాటు జరిగే ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాలు (సిఇసి) విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పికె.శ్రీమతి మాట్లాడుతూ, దేశంలో పదేళ్ల బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు దాసోహమై సామాన్య ప్రజలు, మహిళలు, కార్మికుల జీవన పరిస్థితులను దిగజార్చే చట్టాలను చేసిందన్నారు. వీటన్నిటిపై ఐద్వా సిఇసిలో చర్చించి పోరాట కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి గెలిస్తే ఒకే దేశం, ఒకే భాష, ఒకే ఎన్నిక, ఒకే ఆహారం విధానం ‘డిక్లేర్‌’ చేసే దిశగా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్లాన్‌ రూపొందించిందన్నారు. దేశ సమాఖ్య వ్యవస్థ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై అనేక రూపాల్లో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు దాడి చేస్తున్నాయని తెలిపారు. ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారంపై సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు బిజెపికి ముఖ్యంగా ప్రధానికి, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు చెంపపెట్టు వంటిదన్నారు. సబ్‌ కా సాత్‌… సబ్‌ కా వికాస్‌ అని మోడీ ప్రభుత్వం చెబుతోందని, ఇది కేవలం కార్పొరేట్‌ సంస్థలకే వెలుగునిస్తోందని వివరించారు.

దేశమంతటా బ్లాక్‌ ఫ్రై డే : మరియం థావలే

దేశంలో హర్యానా, పంజాబ్‌ సరిహద్దుల్లోనూ, ఢిల్లీ రాజధానిలోనూ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు పోరాడుతుంటే వారిపై మోడీ సర్కారు కాల్పులు జరపడం, భాష్పవాయువులు ప్రయోగించడం, నీటి ఫిరంగులను ఉపయోగించడం శోచనీయమని ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం థావలే అన్నారు. ఒక రైతు మరణానికి కారణమైన మోడీ సర్కారుపై శుక్రవారం దేశమంతటా బ్లాక్‌ ఫ్రై డే జరిగిందని, విశాఖలో ఐద్వా సిఇసిలో కూడా నల్లబ్యాడ్జీలు పెట్టుకుని సమావేశంలో పాల్గన్నామని తెలిపారు. రైతులను అడ్డుకోడానికి భారీ ఇనుప కంచెలు, బారికేడ్లు, రోడ్లపై మేకులు కొట్టి రైతుల రక్తం కళ్ల చూసిన మోడీ సర్కారు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదన్నారు. ప్రజలు, కార్మికుల ప్రజాస్వామ్య పోరాటాలను, రైతుల ఉద్యమాలను అణచివేస్తోందని వివరించారు. దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోవడంతో యువత గంజాయి, డ్రగ్స్‌, ఆన్‌లైన్‌ జూదాల వైపు దారిమళ్లిపోతున్నారని, మహిళలపై అత్యాచారాలు, వేధింపులూ పెరిగిపోతున్నాయని, అయినా, మోడీ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందని అన్నారు. రైతుల, గిరిజనుల భూములను అనేక రాష్ట్రాల్లో గుంజుకుని పీసా చట్టాన్ని నిర్వీర్యం చేసి అదానీకి వేల ఎకరాలు దఖలు పరిచేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు.

స్వయం సహాయక గ్రూపుల రుణాలు రద్దు చేయాలి : ఎస్‌ పుణ్యవతి

ఐద్వా ఆలిండియా కోశాధికారి ఎస్‌.పుణ్యవతి మాట్లాడుతూ, దేశంలో కార్పొరేట్లకు మోడీ రూ.15 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని, దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్న స్వయం సహాయక మహిళా సంఘాల రుణాలను ఎందుకు రద్దు చేయరని ప్రశ్నించారు. బిజెపి పాలనలో ధరల పెరుగుదలతో దేశంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా కునారిల్లిపోతున్నాయని, గతంలో రూ.500 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,200కు పెంచడంపై రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల కోడలు అని చెప్పుకునే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మహిళల బాధలు కనబడలేదా? అంటూ నిలదీశారు. అన్నం పెట్టే రైతు రోడ్డెక్కితే కాల్పులు జరపడానికి మోడీకి సిగ్గుందా? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి, విశాఖ జిల్లా అధ్యక్షులు బి.పద్మ, కార్యదర్శి వై.సత్యవతి తదితరులు పొల్గొన్నారు.

➡️