దొంగే దొంగ అన్నట్లుగా వుంది-‘విశాఖ డ్రగ్స్‌’పై సజ్జల

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:విశాఖ పోర్టులో పట్టుబడ్డ డ్రగ్స్‌ వ్యవహారంలో దొంగే దొంగ..దొంగ అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్‌ వ్యవహారంలో తెలుగుదేశం, బిజెపి నేతల పాత్ర వున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. తప్పించుకునేందుకే తమప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని విమర్శించారు.. డ్రగ్స్‌ దొరికన కంపెనీలో పురందరేశ్వరి కుమారుడు, ఆమె వియ్యంకుడు డైరక్టర్‌లుగా వున్నారని తెలిపారు. అలాగే చంద్రబాబునాయుడు బందువుల పాత్ర కూడా వుందన్నారు. వాస్తవాలు ఇలా వుంటే తమ ప్రభుత్వంపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం, తప్పుడు ఆరోపణలు బాద్యతారాహిత్యంగా చేస్తున్నారని విమర్శించారు. విశాఖ పోర్టులో సిబిఐ డ్రగ్స్‌ను సీజ్‌ చేసింది పురంధేశ్వరి బంధువులకు చెందిన కంపెనీలనే అనే అంశం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు వ్యవస్థల మీద గౌరవం లేని వ్యక్తిలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్‌పై తూతు మంత్రంగా దాడులు చేశారని అన్నారు. డ్రగ్స్‌ నిందితులందరికీ తెలుగుదేశం నేతలతో సంబంధాలు ఉన్నాయని విమర్శించారు. ఈ డ్రగ్స్‌ విషయంలో నిజాలు నిగ్గుతేల్చేందుకు సిబిఐకి లేఖ రాస్తామని తెలిపారు. అలాగే ఎన్నికల కమిషన్‌కూడా దృష్టి సారించాలని కోరారు. డ్రగ్స్‌ కంటైనర్‌ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థలన్నింటిని కోరుతామని తెలిపారు.

➡️