న్యూఇయర్‌ వేడుకల్లో మానకొండూరు ఎమ్మెల్యే అత్యుత్సాహం

Jan 2,2024 14:29 #enthusiastic, #Manakondur MLA

కరీంనగర్‌ : రాష్ట్ర వ్యాప్తంగా న్యూఇయర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. యువతతో పాటు ప్రజాప్రతినిధులు సైతం కొత్త సంవత్సరం వేడుకల్లో హుషారుగా పాల్గన్నారు. న్యూఇయర్‌ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆటపాటలతో హోరెత్తించారు. సరిగ్గా 12 గంటల సమయంలో కేక్‌ కట్‌ చేసి, పటాకులు కాల్చి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు.అయితే కరీంనగర్‌ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో నిర్వహించిన న్యూఇయర్‌ వేడుకల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అత్యుత్సాహం ప్రదర్శించారు. కేక్‌ కటింగ్‌ సందర్భంగా అక్కడున్న మహిళా కార్యకర్తలతో ఎమ్మెల్యే అసభ్యంగా ప్రవర్తించారు. ఓ మహిళా కార్యకర్త ముఖానికి ఆయన కేక్‌ పూయగా, ఆమె పక్కకు తప్పుకుంది. అయితే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పక్కకు నెట్టి మరి ఎమ్మెల్యే సత్యనారాయణ ఆ మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. మానకొండూరు ఎమ్మెల్యేపై నెటిజన్లు, స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. అధికార మదంతోనే ఎమ్మెల్యే అమర్యాదగా ప్రవర్తించారని దుమ్మెత్తిపోశారు.

➡️