పాలకుల విధానాలతో చేనేత రంగం కుదేలు

Jan 20,2024 21:45 #AP Cheneta Karmika Sangham, #sabha

– ఎపి చేనేత రాష్ట్ర మహా సభలో ముప్పాళ్ల

ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా)దేశంలో వ్యవసాయం తరువాత అతిపెద్ద రంగమైన చేనేతను పాలకుల విధానాలతో నిరాధారణకు గురై కునారిల్లుతోందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని మార్కండేయ కల్యాణ మండపంలో చేనేత నాయకులు చిమ్మన నాగభూషణం, అందే నరసింహారావు ప్రాంగణంలో రెండు రోజుల పాటు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం 13వ రాష్ట్ర మహాసభ శనివారం ప్రారంభమైంది. తొలుత చేనేత కార్మిక సంఘం జెండాను సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు జెవివి సత్యనారాయణమూర్తి ఆవిష్కరించారు. సభ ప్రారంభానికి ముందు ఎన్‌ఆర్‌ఐ వై జంక్షన్‌లోని నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టా హేమ సుందర్‌రావు, సహాయ కార్యదర్శి పామిశెట్టి గోవిందు, గోట్టిముక్కల లక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రసంగించారు. దేశంలో సుమారు 7 కోట్ల మంది చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, ఇటువంటి రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం శోచనీయమని అన్నారు. చేనేతను పరిరక్షించుకోవడం కోసం అనేక పోరాటాలను నిర్వహించి 11 రకాల రిజర్వేషన్లను సాధించుకున్నామని, మోడీ అధికారం చేపట్టిన తర్వాత వాటిని రద్దు చేశారని తెలిపారు. రాష్ట్రంలో లక్షా 50 వేల మగ్గాలున్నాయని, వీటిపై లక్షలాది మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ మహాసభకు సౌహార్థ సందేశాన్నిస్తూ బిజెపి ప్రభుత్వం చేనేత పరిశ్రమను దెబ్బతీసే విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కేంద్రాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. ఆల్‌ ఇండియా వివర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షులు బండారు ఆనందప్రసాద్‌, రాష్ట్ర అధ్యక్షులు ఇనమాల శివరాం ప్రసాద్‌, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లలమర్రి నాగేశ్వరరావు, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు జన్నాదుల వరప్రసాద్‌ సభలో ప్రసంగించారు.

➡️